శని, ఆదివారాలు రెండు రోజులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు ‘గద్దరన్న యాదిలో’ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పసునూరి రవీందర్ అధ్యక్షత వహించనున్నారు. ప్రొఫెసర్ ఖాసీం, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, ఏపూరి సోమన్న, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, యశ్పాల్, మాస్టార్జీ తదితరులు పాల్గొంటారు. 11వ తేదీ ఆదివారం సాయంత్రం ‘నేటి బాలసాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. మణికొండ వేదకుమార్, చొక్కాపు వెంకటరమణ, డా.సి.ఎ.ప్రసాద్, డా.విఆర్.శర్మ, అమరవాది నీరజ, దుర్గం బైతి, పెందోట వెంకటేశ్వర్లు పాల్గొంటారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాలు కొలువుదీరాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవానికి తరలివచ్చాయి. శుక్రవారం సాయంత్రం పుస్తక ప్రదర్శనను ప్రముఖ రచయిత, ఇంటినే గ్రంథాలయంగా మార్చుకున్న పుస్తక మహోద్యమకారుడు పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తకమే మనిషిని పరిపూర్ణం చేస్తుందన్నారు. పుస్తక ప్రదర్శన వేదికకు, ప్రాంగణానికి ప్రజాగాయకుడు గద్దర్, ఆచార్య రవ్వా శ్రీహరిల పేర్లు పెట్టడం అభినందనీయమన్నారు. పుస్తకమే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని, పుస్తకాలు బాగా చదివిన వాళ్లే మహాత్ములయ్యారని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, పుస్తకమే ప్రపంచాన్ని ఏలుతోందన్నారు. అక్షరానికి మరణం లేదని చెప్పారు. పుస్తక ప్రదర్శన కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్‌రెడ్డి, కె.శ్రీనివాస్, సుధా భాస్కర్, ‘వీక్షణం’ వేణుగోపాల్, గద్దర్ కూతురు వెన్నెల తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో తెలంగాణ అమరుల స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సకల రుగ్మతలకు విరుగుడు పుస్తక పఠనమేనని పేర్కొన్నారు.
విభిన్న రంగాలపై అరుదైన గ్రంథాలు
బుక్‌ఫెయిర్‌లో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేశారు. విభిన్న రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో పేరొందిన పలు ప్రచురణ సంస్థలు సరికొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాయి. రచయితలు తాము రాసిన పుస్తకాలను స్వయంగా విక్రయించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా ప్రదర్శన ప్రారంభమైన మొదటి రోజే వేలాది మంది పుస్తకప్రియులు, సందర్శకులు తరలి వచ్చారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం, ఆయుర్వేదం, హోమియో వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ప్రధాని పీవీకి శుక్రవారం కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో పలువురు యువతీ యువకులు ఆయన పుస్తకాలను కొనుగోలు చేశారు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయనపై వెలువడినవి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి.
రైటర్స్ స్టాల్‌లో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’
వివిధ భాషల్లో ఇప్పటికే కోటికి పైగా అమ్ముడైన జిమ్‌కార్బెట్ రాసిన ‘ది మ్యాన్ ఈటింగ్ లియోపార్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్’ పుస్తకం తెలుగులో ‘రుద్ర ప్రయాగ చిరుతపులి’గా వెలువడింది. అనేక సంవత్సరాలుగా తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తకాన్ని 356– 360 స్టాళ్లలో అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment