12న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
వారానికి ఆరు రోజులపాటు సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సదుపాయాలు, అత్యధిక వేగంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసే వేళైంది. ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో ఈ ట్రైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో నిర్వహించనున్న ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్– విశాఖ మధ్య ఇప్పటికే నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వంద శాతానికిపైగా ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తోంది.
ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా రైల్వేశాఖ ఈ రూట్‌లో రెండోరైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 13న విశాఖపట్టణం నుంచి, 15న సికింద్రాబాద్ నుంచి వందేభారత్ సెకెండ్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 12వ తేదీ నుంచి ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖకు సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో చేరుకోనుంది. ఈ ట్రైన్ వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో నిమిషం నుంచి 2 నిమిషాలపాటు హాల్టింగ్ సదుపాయం ఉంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వేళలు
► సికింద్రాబాద్–విశాఖపట్టణం(20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇది ఉదయం 6.39 గంటలకు వరంగల్, 7.43 గంటలకు ఖమ్మం, 9.05 గంటలకు విజయవాడ, 11 గంటలకు రాజమండ్రి, ఉదయం 11.43 గంటలకు సామర్లకోట స్టేషన్లకు చేరుకుంటుంది.
► విశాఖపట్టణం–సికింద్రాబాద్ (20708) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 4.03 గంటలకు సామర్లకోట, 4.38 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6.40 గంటలకు విజయవాడ, రాత్రి 8.03 గంటలకు ఖమ్మం, 10.03 గంటలకు వరంగల్, రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment