ట్యాంక్‌బండ్ కేంద్రంగా సోమవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వాహనచోదకులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఓ దశలో ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీక్ అవర్ కావడంతోనే ట్రాఫిక్ ఆగిందంటూ పోలీసులు వివరణ ఇచ్చారు. జంట నగరాలకు ఉన్న కనెక్టింగ్ రూట్లలో ప్రధానమైన ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ జామ్స్ నిత్యకృత్యంగా మారిపోయాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండటంతో కట్టమైసమ్మ దేవాలయం, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాల వద్ద అధికారులు కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీంతో ట్యాంక్‌బండ్ పైన గతంలో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. ఈ కారణాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్యాంక్‌బండ్ కేంద్రంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి.
లిబర్టీ, ఖైరతాబాద్, రాణిగంజ్ వైపుల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ జామ్‌తో దాదాపు గంటకు పైగా వాహనచోదకులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ‘భారీగా వాహనాలు రావడం, పీక్ అవర్ కావడంతో పాటు రవీంద్రభారతి, రిజర్వ్ బ్యాంక్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ చౌరస్తాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది’ అని ట్రాఫిక్ విభాగం అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment