
మహా నగరంలో మన్మోహన్!
సిటీతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనుబంధం
సాక్షి, హైదరాబాద్: భాగ్య నగరంతో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో కీలకమైన సందర్భాల్లో, ఆపదల్లో తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సమయంలో నేరుగా సందర్శించి నగరవాసులకు ధైర్యాన్ని అందించారు. ఆయనకు ఎంతో ప్రీతిపాత్రుడైన గురువు శ్రేయోభిలాషి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కన్నుమూసిన సమయంలో నగరానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పీవీ కుటుంబం అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండేవారు.
ఓయూ గౌరవ డాక్టరేట్..
మన్మోహన్ సింగ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అర్థశాస్త్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన కృషిని గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. నగర మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసింది కూడా మన్మోహన్ సింగే కావడం గమనార్హం.
నేనున్నానని..
2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సమయంలో 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. నగరం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు.. నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఇక్కడ పర్యటించారు. నేనున్నానంటూ నగరవాసులకు భరోసా కల్పించారు. అంతకు ముందు 2012లో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరించారు. అంతేకాకుండా.. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నగరాన్ని వేదిక చేసేందుకు, నగర ఖ్యాతి పెంచేందుకు అవిరళమైన కృషి చేశారు.
మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా... నేరుగా రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నందుకు ఎంతో బాధ పడ్డట్లు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆధార్’ పైలట్ ప్రాజెక్టును మహేశ్వరంలో ప్రారంభించేందుకు కృషి చేశారు. దీని కోసం ఆ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న నందన్ నిలేఖన్‌తో ప్రత్యేకంగా చర్చించారు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు భరోసానిచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment