రావణకాష్టంలా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్‌కు నాలుగో వంతు జన నష్టం
శరణార్థులుగా మారిన 60 లక్షల మంది
2 లక్షల సైనికులను కోల్పోయిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.
రావణకాష్టంలా...
2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.
చిరకాలంగా రష్యా కన్ను
1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.
ఆర్థిక వ్యవస్థ పతనం..
యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment