శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది.
కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది.
ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు.
ఇంటికెళ్లిన కాసేపటికే..
సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు.
కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు.
అక్కడ సర్జరీలు కామన్..
కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment