nose job
-
అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే..
శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కన్పించాలని ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఓ యువతి 24 గంటలు కూడా తిరగకుండానే ప్రాణాలు కోల్పోయింది. ముక్కు ఆకృతి మార్చుకునేందుకు ఆరున్నర గంటల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఈమె.. ఇంటికెళ్లిన కాసేపటికే సృహ కోల్పోయి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి చూసిన వైద్యులు షాక్ అయ్యారు. యువతి ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితి. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుసార్లు కార్డియోరెస్పిరేటరీ అరెస్టులతో(శ్వాసవ్యవస్థ దెబ్బతినడం) ఆమె కన్నుమూసింది. ముక్కుకు సర్జరీ చేయించుకుని చనిపోయిన ఈ యువతి పేరు కారెన్ జులియెత్ కార్డెనాస్ యురిబె. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తోంది. వయసు 21 ఏళ్లు. సైకాలజీ కోర్సు చివరి సెమిస్టర్ చదువుతోంది. తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. ఇంటికెళ్లిన కాసేపటికే.. సర్జరీ అనంతరం ఇంటికెళ్లిన జులియెత్ కాసేపటికే సృహతప్పి పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపయ్యాక తేరుకున్న యువతి మళ్లీ కుప్పకూలింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడుకి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు. ఆమెను మళ్లీ తన ఆస్పత్రికి తీసుకురావాలని అతను సూచించాడు. అయితే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు యువతి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆమె లేచినా మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. దీంతో ఆమెను స్కానింగ్ చేసిన వైద్యులు అవాక్కయ్యారు. ఆమె ఊపిరితిత్తుల నిండా రక్తం నిండిపోయింది. శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో ఆమెకు పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఆరు సార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అతనిపై కేసు పెడతామని చెప్పారు. అక్కడ సర్జరీలు కామన్.. కాగా.. అమెరికాలో ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం 2020 నుంచి బాగా పాపులర్ అయ్యింది. అందంగా కన్పించేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా సర్జరీలు చేయించుకుంటున్నారు. మొత్తం 3,52,555 మంది ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: 18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు.. ఆ డబ్బుతో ఏం చేసిందంటే..? -
నా ముక్కు బాలేదన్నారు
ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే నటనతో పాటు ముక్కు ముఖం కూడా బావుండాలంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముక్కు విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ‘నీ ముక్కు బాలేదు’ అని కొందరు ముక్కుసూటిగా చెప్పేవాళ్లట. 2009లో వచ్చిన ‘అలాదిన్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు శ్రీలంక మూలాలున్న జాక్వెలిన్ ఫెర్నాండజ్. నటిగా బాలీవుడ్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘నటిగా బాలీవుడ్లో నా లక్ టెస్ట్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం శ్రీలంక నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లు ఎవ్వరూ లేరు. ఓ గుర్తింపు సంపాదించుకోవాలనే తపనతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాను. హీరోయిన్గా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చాలా మంది నా పేరు మార్చుకోమని సలహా ఇచ్చేవాళ్లు. ఫెర్నాండజ్ ఏంటి? ముస్కాన్ అని పెట్టుకో బావుంటుంది అని ఒకరు, నీ ముక్కు బాలేదు, ముక్కు సర్జరీ చేయించుకో అని మరొకరు, ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దు అని కొందరు.. ఇలా రకరకాలుగా చాలా చెప్పేవారు. కానీ నేను మాత్రం నాలానే ఉండాలని నిశ్చయించుకున్నాను.. ఉన్నాను. ఈ పదేళ్ల ప్రయాణం నటిగా చాలా సంతృప్తినిచ్చింది. ఆ సలహాలు గుర్తు చేసుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది’’ అని ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తుచేసుకున్నారు. అన్నట్లు.. ‘సాహో’లో ప్రభాస్‌తో కలిసి ‘బాడ్ బ్యాయ్..’ అనే పాటకు జాక్వెలిన్ స్టెప్పులేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
టీవీ నటి ముక్కుకు సర్జరీ!
లాస్ ఏంజిల్స్: ప్రముఖ టీవీ నటి కిమ్ కర్దాషియాన్‌పై పారిస్‌లో దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన అనంతరం ఆమె ఎక్కువగా వార్తల్లో ఉండటం మానేశారు. పబ్లిక్ ఈవెంట్లకు కాస్త దూరంగానే ఉంటున్నారు. తాజాగా క్రిస్మస్ ఈవ్ పార్టీలో కనిపించిన ఈ అమ్మడుపై సోషల్ మీడియాలో కామెంట్లు మళ్లీ గుప్పుమన్నాయి. పార్టీలో గోల్డెన్ డ్రెస్‌లో కర్దాషియాన్ తళుక్కుమన్నా.. అభిమానులు మాత్రం ఆమె ముక్కునే ఎక్కువగా పరిశీలిస్తున్నారు. చెల్లి కోలే కర్దాషియాన్‌తో కలిసి ఉన్న వీడియోలో కిమ్ ముక్కులో చాలా మార్పు ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు కొంచెం మందంగా ఆమె జాతి మూలాలకు దగ్గరగా ఉన్న ముక్కు ఇప్పుడు 'రీనో ప్లాస్టీ' మూలంగా మరీ సన్నగా మారిందని అంటున్నారు. కాస్మొటిక్ సర్జన్ టీజే ఈషో దీనిపై మాట్లాడుతూ.. సర్జరీ రిజల్ట్ బాగుందన్నారు. గతంలోనూ పలుమార్లు కిమ్‌పై ఇలాంటి వార్తలు వచ్చాయి.