వాషింగ్టన్ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖతో చర్చించాలని అమెరికా చట్టసభల్లోని కొంతమంది శానససభ్యులు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోకు లేఖ రాశారు. అయితే రైతు నిరసల విషయంలో ఇతర దేశాల జోక్యం అనవసరమని, గతంలోనే భారత్ స్పష్టం చేసింది. ఇది భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇదివరకే చెప్పారు.కానీ ఇది భారత్‌తో ముడిపడి ఉన్న అందరికీ ఆందోళన కలిగించే అంశమని, భారత అమెరికన్లపై కూడా ఈ ఉద్యమం ప్రభావం చూపుతుందని వారు లేఖలో పేర్కొన్నారు. (‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’ )
ముఖ్యంగా పంజాబ్‌తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ఇది మరింత ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. భారత చట్టాలను తాము గౌరవిస్తామని, అయితే రైతుల ఆర్థిక భద్రతపై కూడా తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత విదేశాంగ శాఖతో చర్చించి, సానుకూలతతో సమస్య పరిష్కరించేలా చూడాలని కోరారు. లేఖ రాసిన వారిలో ప్రవాస భారతీయురాలు ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు నవంబర్26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రైతు వ్యతిరేక చట్టాలని, కనీస మద్దతు ధరకు అవకాశం లేకుండా చేస్తాయని, కార్పోరేట్‌ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి దేశంలోని వివిధ వర్గాల నుంచి సహా అమెరికాకు చెందిన పలువురు శాసనసభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రైతులను అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నిరసనను ఒక్క రాష్ట్రానికే పరిమితమైనదిగా కాకుండా జాతీయ నిరసనగా పరిగణించాలని లేఖలో ప్రధానిని కోరారు. (కేంద్రానికి రైతుల హెచ్చరిక )
Comments
Please login to add a commentAdd a comment