ఇరాన్‌తో పాటు ఆ దేశం మద్దతు కలిగిన రెబల్ గ్రూపుల నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా పశ్చిమాసియాలో అదనపు యుద్ధ విమానాలను, నౌకాదళ నౌకలను భారీగా మోహరించేందుకు సమయాత్తమవుతోంది.
ఇరాన్, రెబల్ గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌కు రక్షణ అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. పశ్చిమాసియాకు మరిన్ని యుద్ధ విమానాలను పంపాలని అమెరికా డిఫెన్స్ చీఫ్‌ను ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొంది.
ఇదేవిధంగా అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్టిన్ ఇజ్రాయెల్‌కు అదనపు సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారు. టెహ్రాన్‌లో ఇటీవల హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తోంది.
హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలు, హెజ్ బొల్లాకు చెందిన సీనియర్ మిలిటరీ కమాండర్ హత్యలతో పశ్చిమాసియా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ మూడు హత్యలలో రెండింటిలో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ మూడు ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశాలున్నాయని అమెరికా అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment