వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు తమ సమీప బంధువునో, సన్నిహితులనో కోల్పోయినట్టు అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)–ఎన్‌ఓఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఎఫెయిర్స్ రీసెర్చ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ కేసులు పూర్తిగా తగ్గుతున్న దశలోతిరిగి నూతన సంవత్సర సెలవుల్లో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
అయితే ఇప్పటికింకా అమెరికా ప్రజలు సురక్షితం గా ఉండేందుకు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ‘దీన్నింకా మేం మర్చిపోలేక పోతున్నాం. ఈ ఘోరం నిన్ననే జరిగినట్టుంది మాకు. సన్నిహితులను, బంధుమిత్రులను కోల్పోవడం మా హృద యాలను తొలుస్తూనే ఉంది’ అని ఫ్లోరిడా లోని ఒలూసియా కౌంటీకి చెందిన నెట్టీ పార్క్స్ చెప్పారు. పార్క్స్ ఏకైక సోదరుడు గత ఏప్రిల్‌లో కోవిడ్‌తో మరణించారు. పార్క్స్, ఆమె ఐదుగురు అక్కాచెల్లెళ్లు కనీసం స్మారక సమావేశాన్ని కూడా ప్రయాణ ఆంక్షల కారణంగా నిర్వహించలేకపోయారు.
తక్కువ ఆదాయ కుటుంబాలు, నల్లజాతీయులపై అధిక ప్రభావం
నల్లజాతీయులు, హిస్పానిక్ అమెరికన్లు, తక్కువ ఆదాయ కుటుంబీకులైన అమెరికన్లు కోవిడ్‌తో తమ సన్నిహితులను కోల్పోయినట్లు సర్వేలో వెల్లడించింది.
ఉద్యోగాలు కోల్పోయాం
ఉద్యోగం కోసం బయటకు వెళితే, కరోనా కాలంలో కష్టం కనుక తాను చేస్తోన్న కస్టమర్ సర్వీస్ ఉద్యోగాన్ని ఏడాది క్రితం వదులుకోవాల్సి వచ్చిందని సర్వేలో పాల్గొన్న 60 ఏళ్ళ పార్క్స్ చెప్పారు. ఇప్పుడు చాలా రాష్ట్రాలూ, నగరాల్లో ఆంక్షలు సడలించడతో తాము ఆందోళనలో ఉన్నట్టు వారు చెప్పారు. ఎక్కువ మంది అమెరికన్లను ఇంకా కోవిడ్ భయం వెంటాడుతోంది. అయితే గత కొద్దినెలలుగా ప్రజల్లో ఈ ఆందోళన తగ్గుముఖం పట్టింది. ‘ఈ మహమ్మారి అంతం కాలేదని ప్రజలు అర్థం చేసుకోవాలి. బయటకు వెళ్ళకుండా కోవిడ్ నుంచి రక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పార్క్స్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా అనుభవంలోకి వస్తే తప్ప దీని తీవ్రత అర్థం కాదు అని ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని వాక్స్‌నర్ మెడికల్ సెంటర్‌కి చెందిన మానసిక విభాగం చీఫ్ డాక్టర్ లువాన్ ఫాన్ చెప్పారు.
కోవిడ్ వస్తుందేమోననే..
ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులను పక్కన పెడితే 43 శాతం మంది బ్లాక్ అమెరికన్స్, 39 శాత మంది హిస్పానిక్స్ కోవిడ్ వస్తుందేమోనని ఆందోళనకు గురవుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ ఆందోళన శ్వేత జాతీయుల్లో కేవలం 25 శాతం మాత్రమే ఉంది.
వ్యాక్సిన్‌పట్ల విముఖత
వ్యాక్సిన్ పట్ల చాలా మంది విముఖత చూపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. యువత, కాలేజీ డిగ్రీలు లేనివారు, రిపబ్లికన్లు టీకా తీసుకునేందుకు అయిష్టత చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు టీకాకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. పదహారు శాతం మంది బ్లాక్ అమెరికన్లు, 15 హిస్పానిక్స్ తాము టీకా తొలి డోసు తీసుకున్నట్టు చెప్పారు. శ్వేత జాతీయుల్లో 26 శాతం మంది టీకా తీసుకున్నట్టు తెలిపారు. ఈ మూడు గ్రూపుల్లోని అత్యధిక మంది టీకా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
టీకా నమోదు ప్రక్రియపై అసంతృప్తి
టీకా తీసుకునేందుకు భారీ డిమాండ్ ఉందని సర్వే పేర్కొంది. ప్రతి పది మంది అమెరికన్లలో ఒకరు, ప్రధానంగా వృద్దులు టీకా కోసం దరఖాస్తు చేసుకునే ప్రాసెస్ సరిగ్గా సాగడం లేదని అభిప్రాయపడుతున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని జాన్ పెరేజ్ అనే స్కూల్ అడ్మినిస్ట్రేటర్ టీకా కోసం ఆన్‌లైన్‌లో టీకాŒ నమోదు ప్రక్రియకు గంటల సమయం పట్టిందని చెప్పారు.
కోవిడ్‌ని తీవ్రంగా పరిగణించలేదంటోన్న పౌరులు
మూడింట రెండొంతుల మంది అమెరికన్లు తమ తోటి పౌరులు కోవిడ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని భావిస్తున్నట్టు చెప్పారు. అనూహ్యంగా 60 శాతం డెమొక్రాట్లు, స్థానిక కమ్యూనిటీలు కోవిడ్‌ని తీవ్రం గా పరిగణించలేదని అంటే, 83 శాతం మంది డెమొక్రాట్లు దేశం మొత్తం అలాగే ఉందన్నారు.
వ్యాక్సిన్‌పై విశ్వాసం బలపడుతోంది
మొత్తంగా 25 శాతం మంది అమెరికన్లలో వ్యాక్సిన్‌పై విశ్వాసంలేదని సర్వే గుర్తించింది. టీకాపై నమ్మకం క్రమంగా పెరుగుతోందని అధ్యయనం తెలిపింది. ‘మొదట్లో టీకా వ్యవహారం రాజకీయంగా మారడంతో సందేహించాం. ఇప్పుడు మాత్రం తమ వంతు వచ్చినప్పుడు టీకా తీసుకునేందుకు మా కుటుంబమంతా సిద్ధం’ అని బాబ్ రిచర్డ్ స్మిత్‌ఫీల్డ్ చెప్పారు.
ప్రతి ఐదుగురిలో ఒకరు సన్నిహితులను కోల్పోయామన్న అమెరికన్లు (శాతాలవారీగా)
వయోజనులు 19%
నల్లజాతీయులు 30%
హిస్‌పానిక్ 29%
శ్వేత జాతీయులు 15%
30 వేల డాలర్ల దిగువ ఆదాయం కలిగిన వారు 24%
30 వేల డాలర్లకన్నా ఎక్కువ ఆదాయం కలిగినవారు 17%
Comments
Please login to add a commentAdd a comment