ప్రకృతి అనేది మానవులకి లభించిన అద్భతమైన వరం. అయితే మనమే అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాం. ఆ ఫలితాలే.. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలు వంటివి ప్రజల్ని పలకరిస్తూ తీవ్ర నష్టాలను తీసుకొస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ దారుణానికి కారణమేంటి, అక్కడ ఏం జరిగింది?
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో రెండో పొడవైన నదిగా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్ నది పేరు గాంచింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర రాజధాని సిడ్నీకి పశ్చిమాన 1,000కిమీ (620 మైళ్లు) దూరంలో ఉన్న ఈ నదిలో ఎటు చూసిన కిలోమీటర్ల మేర చేపలు నిర్జీవంగా తేలియాడుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దీన్ని పరిశీలించిన అధికారులు వరద నీరు తగ్గుముఖం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే భారీ స్థాయిలో చేపల మృత్యువాతకు కారణమని తెలిపారు.
2018, 2019లోనూ ఇదే తరహాల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇటీవలి వరదల తరువాత నదిలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అంచనా వేసేందుకు రాష్ట్ర మత్స్య అధికారులను ఆ ప్రాంతానికి పంపినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment