పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్ పత్రాలు కనిపించకుండా పోయాయి.
కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ చేసేందుకే ఈ బ్యాలెట్ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటింగ్ ప్రారంభించేముందు పాక్ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్‌ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. కాగా
ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్‌లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment