‘2021 మే నాటికి కరోనా అంతం’ | Bill Gates About Coronavirus Pandemic End | Sakshi
Sakshi News home page

కరోనా అంతం ఎప్పుడో చెప్పిన బిల్‌ గేట్స్‌

Published Mon, Aug 10 2020 4:10 PM | Last Updated on Mon, Aug 10 2020 6:42 PM

Bill Gates About Coronavirus Pandemic End - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మన దగ్గర ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌, బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌ కరోనా అంతానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుంది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్‌ తుడిచిపెట్టుకుపోతుంది. కరోనా వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. కాకపోతే ఈ వైరస్‌ వైద్యరంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి రావడానికి సాయం చేసింది. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్‌ పరిశోధనల్లో పురోగతి జరిగింది’ అన్నారు బిల్‌ గేట్స్‌. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225)

కరోనా వ్యాక్సిన్‌ కోసం బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ నిధులు సమకూర్చతున్నది. ఈ క్రమంలో గతవారం పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌.. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ నుంచి 150 మిలియన్‌ డాలర్ల నిధులు.. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గేవ్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులు అందాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసే కొన్ని వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ రెండింటికి గాను ఒక డోస్‌కి 3 డాలర్ల ధర నిర్ణయించబడింది. ఇది 90 కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో పాటు దీని మద్దతు ఉన్న గవి కూడా ప్రపంచ దేశాలన్నింటికి వేగంగా.. సమానంగా కరోనా వ్యాక్సిన్‌ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement