కాబూల్: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మరిన్ని పేలుళ్లు జరుగుతాయన్న భయంతో పలు దేశాలు అఫ్గాన్‌లోని తమ ప్రజలను వెనక్కురప్పించే యత్నాలను ముమ్మరం చేశాయి. పేలుడు అనంతరం మూతపడిన విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రాకపోకలు ఆరంభమయ్యాయి. బాంబుల భయం తీరకపోయినా, విమానాశ్రయం బయట వందలాదిమంది గుంపులుగా దేశం విడిచి పోయేందుకు ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆగస్టు 31నాటికి యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలగనున్నాయి.
అనంతరం ఏమైతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో అఫ్గాన్ ప్రజానీకం ఉంది. అందుకే ఈలోపే ఏదో ఒక దేశానికి పారిపోవాలని పలుమంది విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్నారు. కాబూల్ నుంచి దాదాపు లక్షకు పైగా ప్రజలను సురక్షితంగా వేర్వేరు ప్రదేశాలకు తరలించామని అమెరికా ప్రకటించింది. ఇంకా వేలాది మంది పారిపోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. విదేశాలకు పోయే అవకాశం లేని పౌరులు దేశ సరిహద్దులకు చేరుకొని పొరుగు దేశాల్లో తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో దాదాపు 5లక్షల మంది అఫ్గాన్ సరిహద్దు దేశాలకు శరణార్థులుగా పోవచ్చని యూఎస్ మిలటరీ అంచనా వేసింది.
నిశితంగా గమనిస్తున్నాం: భారత్
ఆపరేషన్ దేవి శక్తి పేరిట ఆఫ్గానిస్తాన్‌లోని భారతీయుల తరలింపు ప్రక్రియను ఇండియా కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆరు భారత విమానాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 550 మందిని స్వదేశానికి తెచ్చాయి. వీరిలో దాదాపు 260మంది భారతీయులున్నారు. వీరితో పాటు అర్హులైన అఫ్గాన్ పౌరులను కూడా భారత్ సురక్షితంగా తరలించిందని, ఇంకా తరలింపు కొనసాగుతోందని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని, అఫ్గాన్‌లోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. అఫ్గాన్‌లో మిగిలిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చడంపైనే శ్రద్ధ పెట్టామన్నారు. దాదాపు 20మంది భారతీయులు, కొందరు అఫ్గాన్ జాతీయులు అనుకున్న సమయానికి విమానాశ్రయానికి రాలేకపోయారని, వీరిని తరలించే యత్నాలు ముమ్మరం చేస్తామని తెలిపారు.
ఏ దేశం ఏం చేస్తోంది?
అమెరికా: యూఎస్ పౌరుల తరలింపును మరిం త వేగవంతం చేసింది. త్వరలో మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందని యూఎస్ అధికారి ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. డెడ్‌లైన్ కల్లా తరలింపును పూర్తి చేస్తామన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఇంకా దాదాపు 5,400మంది తరలింపునకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 24గంట ల్లో దాదాపు 12,500కు పైచిలుకు పౌరులను 89 విమానాల్లో తరలించామన్నారు.
బ్రిటన్: అఫ్గాన్ నుంచి తమ బలగాల తరలింపు ప్రక్రియ ముగిసిందని బ్రిటన్ ప్రకటించింది. శుక్రవారం 9 విమానాలతో తరలింపును పూర్తి చేశామని తెలిపింది. అఫ్గాన్‌లతో కలిపి మొత్తం 14 వేల మందిని దేశం దాటించామని పేర్కొంది. ఇంకా 150 మంది బ్రిటన్ పౌరులు కాబూల్‌లో చిక్కుకుపోయారని ప్రధాని జాన్సన్ తెలిపారు.
స్వీడన్: ఇప్పటివరకు దాదాపు 500 మంది స్వీడిష్ పౌరులతో సహా 1,,100మందిని అఫ్గాన్ నుంచి తీసుకువచ్చామని తెలిపింది.
ఇటలీ: అఫ్గాన్ నుంచి 108మందితో కూడిన చివరి తరలింపు విమానం రోమ్‌కు చేరినట్లు ఇటలీ ప్రకటించింది. శుక్రవారానికి దాదాపు 4,900మంది అఫ్గాన్ పౌరులను దేశం దాటించామంది.
ఫ్రాన్స్: శుక్రవారం రాత్రికి ఫ్రెంచ్ దేశీయుల తరలింపు పూర్తి కావచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
స్పెయిన్: అఫ్గాన్ నుంచి తమ దేశీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని స్పెయిన్ తెలిపింది. సుమారు 1,900మంది అఫ్గాన్ పౌరులను కూడా తమ దేశానికి తెచ్చామంది.
జర్మనీ: 45 దేశాలకు చెందిన దాదాపు 5,347 మందిని సురక్షితంగా సరిహద్దు దాటించామని, గురువారం తమ చివరి రెస్క్యూ విమానం అఫ్గాన్ నుంచి బయటపడిందని తెలిపింది.
టర్కీ: కాబూల్ విమానాశ్రయాన్ని నిర్వహిం చాల్సిందిగా తాలిబన్లు తమను కోరారని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment