
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె వెల్లడించారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని జోలీ చెప్పారు. ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.
భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని జోలి చెప్పారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని తెలిపారు. అందుకే తాము ప్రతిచర్యకు పాల్పడటం లేదని తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలు వారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని తెలిపారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ మండిపడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది.
ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్
Comments
Please login to add a commentAdd a comment