ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం!
ఖర్చుల భారం.. అందుకే..
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది.
కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది.
(చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్)
ఇలాంటి ప్రయోగాలు అవసరమా?
మిడతలతో తయారు చేసిన పఫ్‌లు, ప్రోటీన్ పౌడర్‌ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్‌లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు.
మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం.
అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది.
(చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..)
Comments
Please login to add a commentAdd a comment