
బీజింగ్: కరోనా గండం నుంచి చైనా మరోసారి గట్టెక్కింది. జనవరిలో మొదట్లో కోవిడ్ పీక్ స్టేజికి వెళ్లి భారీగా నమోదైన కేసులు, మరణాలు ఎట్టకేలకు దిగొచ్చాయి. మూడు వారాల క్రితంతో పోల్చితే గణనీయంగా తగ్గాయి.
జనవరి మొదటి వారంతో పోల్చితే కరోనా కొత్త కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం అధికారిక వెబ్‌సైట్లో బుధవారం వెల్లడించింది.
చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, మరో రెండు మూడు నెల్లలో మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు గతవారమే హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. కేసులు తగ్గినట్లు పేర్కొంది.
ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం జనవరి 4న 1,28,000 కరోనా రోగులు ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. అలాగే మరణాలు అప్పుడు రోజుకు 4,273 నమోదు కాగా.. ఇప్పుడా సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుగా ఉండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు పడిపోయింది.
చదవండి: మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్!