వాషింగ్టన్: కమ్యూనిస్ట్ చైనా తమ పొరుగు దేశం క్యూబాలో 2019 నుంచి గూఢచార స్థావరాన్ని నడుపుతోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా చైనా నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్న ప్రయత్నాల్లో ఇదో భాగమని పేర్కొంది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ అధికారి ఈ మేరకు డ్రాగన్ దేశంపై ఆరోపణలు గుప్పించారు. క్యూబాలోని చైనా నిఘా కేంద్రంపై అమెరికా నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచాయని ఆయన తెలిపారు.
చైనా నిఘా కార్యకలాపాల విస్తరణ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నాలను బైడెన్ ప్రభుత్వం ముమ్మరం చేసిందన్నారు. దౌత్యపరమైన, ఇతర మార్గాల్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు కొంత సఫలీకృతమయ్యాయని ఆయన అన్నారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబా గడ్డపై నుంచి చైనా గూఢచర్యం కొత్త విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని తమ నిఘా వర్గాలు అంటున్నాయని ఆ అధికారి ఉటంకించారు.
అట్లాంటిక్ సముద్రం, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో నిఘా కేంద్రాల ఏర్పాటుకు చైనా యత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే క్యూబాలోని నిఘా కేంద్రాన్ని 2019లో చైనా అప్‌గ్రేడ్ చేసిందని ఆ అధికారి వివరించారు. క్యూబాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థ ఏర్పాటుపై రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు గురువారం వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో కథనం వచ్చింది. బదులుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న క్యూబాకు భారీగా ముట్టజెప్పేందుకు చైనా సిద్ధమైందని కూడా అందులో పేర్కొంది. అయితే, వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment