అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది.
చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్‌డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది.
దలైయాన్‌కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్‌వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు.
‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం.
మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు.
కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment