బీజింగ్: చైనా, తైవాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చెంగ్–తె ఇటీవల పరాగ్వే పర్యటకు వెళ్లి తిరిగి వస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ నగరాల్లో ఆగారు. దీంతో డ్రాగన్ దేశం తైవాన్‌కు తీవ్ర హెచ్చరికలు పంపింది. ద్వీపం చుట్టూ శనివారం సైనిక విన్యాసాలకు దిగింది. వేర్పాటువాదులు, విదేశీ శక్తుల కవి్వంపు చర్యలకు ప్రతిగానే తాము ఈ మిలటరీ డ్రిల్స్ చేపట్టినట్టుగా చైనా రక్షణ శాఖ వెల్లడించింది.
యుద్ధ విమానాలు, నౌకల్ని కూడా మోహరించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది. తైవాన్‌ను శాశ్వతంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఉపాధ్యక్షుడు విలియం అమెరికాలోని న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో పర్యటించారు. తైవాన్ తమ దేశంలో భాగమని అంటున్న చైనా విలియం లాయ్ పర్యటనకి హెచ్చరికగా ఇదంతా చేస్తోంది. మరోవైపు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి రావడంపై తైవాన్ మండిపడింది. శనివారం ఉదయం నుంచి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు రావడం కవి్వంపు చర్యలకి దిగడమేనని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment