న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరిస్తున్న డ్రాగన్.. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అక్కర్లేదంటూ యూకేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని పేర్కొంది. పరిస్థితులను చక్కదిద్దుకోగల తెలివి, సామర్థ్యాలు తమకు ఉన్నాయని ఘాటుగా విమర్శించింది. అదే విధంగా హాంకాంగ్ విషయంలోనూ ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోనూ బాహ్య శక్తుల ప్రమేయం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటి కారణంగా శాంతి, సుస్థిరతకు భంగం కలుగుతోందంటూ అమెరికా, యూకేను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ శుక్రవారం ట్వీట్ చేశారు.(అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ)
కాగా హాంకాంగ్ స్వయంప్రత్తిని కాలరాస్తూ చైనా అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా దక్షిణ చైనా సముద్రంపై కూడా ఆధిపత్యం చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పటికే చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్నట్లుగా భావిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్న వేళ అమెరికా, యూకే డ్రాగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంతేగాకుండా భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరును విమర్శిస్తున్నాయి.(అమెరికాకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న చైనా!)
చైనా తీరు సరికాదు: యూకే
ఈ క్రమంలో తాజాగా పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతం, గోగ్రా పోస్ట్ నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బ్రిటీష్ హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ బార్టన్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి అనేక సవాళ్లు విసురుతూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న చైనాకు బుద్ది చెప్పేందుకు మిత్ర పక్షాలతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ సుముఖంగా ఉందని పేర్కొన్నారు.
అదే విధంగా హాంకాంగ్ విషయంలో చైనా అనుసరిస్తున్న తీరు సరికాదని.. భారత్‌తో వాస్తవాధీన రేఖ వెంబడి, దక్షిణ చైనా సముద్రం విషయంలో కూడా డ్రాగన్ చర్యలపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే భారత్- చైనా సరిహద్దు విషయంలో జోక్యం చేసుకునే ఆలోచన మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్ దిగ్గజం హువావేను తమ దేశంలో నిషేధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిప్ వ్యాఖ్యలపై చైనా రాయబారి సన్ వెడాంగ్ ట్విటర్‌లో స్పందించారు.
1/2 Noted remarks regarding #China by British High Commissioner to India, rife with mistakes & false allegations. Boundary question falls within bilateral scope b/t #China & #India. We have wisdom & capability to properly handle differences. No need for third party interference.
— Sun Weidong (@China_Amb_India) July 23, 2020
Comments
Please login to add a commentAdd a comment