ఇటీవల భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తప్పుకుంది. అయితే అదేసమయంలో చైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ జి-20లో ప్రవేశించడం చైనా తనకు ఎదురుదెబ్బగా భావించింది. తాజాగా చైనా.. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా చైనా అవతరించింది. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పబోతోందని అర్థం.
ప్రపంచవ్యాప్తంగా విమర్శలు
2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపునకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనాతో ఆఫ్ఘనిస్థాన్ దోస్తీ ఆ దేశానికి కలిసివచ్చేలా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా మైత్రి భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. అయితే చైనా.. ఆఫ్ఘనిస్థాన్‌తో చెలిమి చేయడంపై ప్రపంచవ్యాపంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాగరిక పాలన సాగిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చైనా స్నేహం చేయడాన్ని ఏ దేశమూ ఇష్టపడటం లేదు.
ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా ఆధిపత్యం?
వాస్తవానికి చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగు పెట్టింది. ఇది చైనా వ్యూహంలో ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా కూడా అదే పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోవాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో వైట్ గోల్డ్‌గా పిలిచే లిథియం నిల్వలపై చైనా దృష్టి సారించింది. చైనా.. ఆఫ్ఘనిస్తాన్‌లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది.
కోటి ఆశలతో చైనాతో చెలిమి
తాలిబాన్ అభిప్రాయం ప్రకారం చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. మరోవైపు చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం దరిమిలా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కాగా చైనా- తాలిబాన్ స్నేహం భారతదేశానికి పలు సమస్యలను తెచ్చిపెట్టనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత అంతర్జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం
ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి కారణంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘనిస్థాన్‌లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి భారతదేశ అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చేయనున్నదనే అంచనాలున్నాయి.
ఇది కూడా చదవండి: వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?
Comments
Please login to add a commentAdd a comment