బీజింగ్ : చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్లలో కీలకమైన సీఎన్‌బీజీ వ్యాక్సిన్‌పై తాజాగా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. వాలంటీర్లపై చేపట్టిన తాజా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని సీఎన్‌బీజీ వెల్లడించింది. ప్రాథమిక, మధ్యస్ధాయి మానవ పరీక్షలో వ్యాక్సిన్ డోసు తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత మెరుగైందని పేర్కొంది. సీఎన్‌బీజీ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్ (బీబీఐబీపీ) బీబీఐబీపీ-కోర్‌వీ పేరిట ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. మూడవ దశ పరీక్షల్లోకి ప్రవేశించిన ప్రపంచంలోని ప్రముఖ పది కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.
డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం మూడవ దశ పరీక్షల్లోకి ప్రవేశించిన వ్యాక్సిన్లలో మూడు చైనా వ్యాక్సిన్‌లు ఉన్నాయి. ఇక బీబీఐబీపీ వ్యాక్సిన్ డోసును తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థ పేర్కొంది. జ్వరం, నొప్పులు వంటి స్వల్ప రియాక్షన్స్ మాత్రమే కొందరిలో వెల్లడయ్యాయని వైద్య పత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయన పత్రం వెల్లడించింది. ఇక ప్రపంచం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై అంతర్జాతీయ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పష్టం చేసింది. చదవండి : రష్యా నుంచి రెండో కరోనా వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment