బీజింగ్: కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఐదు రోజుల్లో ఏకంగా 9 మిలియన్ల కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపింది. వివరాలు.. పోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందిన కింగ్డావో నగరంలో తాజాగా ఆదివారం 6 కరోనా కేసులు వెలుగు చూశాయి. దాంతో ఆ నగరంలోని సుమారు 9.4 మిలయన్ల పై చిలుకు జనాభాకు కరోనా టెస్టులు జరపనున్నట్లు వైద్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఐదు జిల్లాల్లో మూడు రోజులు పరీక్షలు జరపనుండగా.. ఐదు రోజుల్లో మొత్తం నగర జనాభాకు టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. చైనా విస్తృతమైన, వేగవంతమైన పరీక్ష సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ క్రమంలో కొత్త కేసులు వెలుగు చూసిన వెంటనే వైద్య సిబ్బంది కింగ్డావో నగరంలో దాదాపు 1,40,000 పరీక్షలు చేశారు. ఇక జూన్‌లో బీజింగ్‌లో ఏకంగా 20 మిలియన్ల మందికి పైగా కరోనా టెస్టులు చేశారు. రాజధానికి సమీపంలోని ఓ ఫుడ్ మార్కెట్‌లో కోవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఇంత భారీ మొత్తంలో టెస్టులు చేశారు. (చదవండి: కరోనాని అంతం చేస్తాం)
కరోనా వైరస్ చైనాలో ఉద్భవించినప్పటికి ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే.. ఇక్కడ కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ కట్టడి కోసం చైనా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ని విధించింది. దాంతో ప్రపంచ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. ఇక ‘గోల్డెన్ వీక్’ సెలవు దినం సందర్భంగా గత వారం చైనాలో మిలియన్ల మంది ప్రయాణాలు చేశారు. దాంతో దేశంలో వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా యంత్రాంగం తక్కువ సమయంలో ఎక్కువ టెస్టులు చేయడమే కాక అవసరమైతే మరోసారి లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రపంచ దేశాల కంటే ముందు తానే కరోనా వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకురావడానికి చైన విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రయోగాలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించబడని వ్యాక్సిన్‌ని ముఖ్య కార్మికులు, సైనికులపై ప్రయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment