బెర్లిన్: కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యి ఏడాది పూర్తయ్యింది. వైరస్ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో సమర్థవంతమైన వ్యాక్సిన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది. కొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీలో బుధవారం నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఈ సారి నియమాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఈ మేరకు జర్మనీ చాన్సిలర్ ఏంజెలా మెర్కెల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. గత ఆరు వారాలుగా జర్మనీలో పాక్షిక లాక్‌డౌన్ అమల్లో ఉంది. కానీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఒక్క రోజు 20,209 కేసులు నమోదు కాగా.. 321 మంది మరణించారు. దాంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో.. మరింత కఠినంగా లాక్‌డౌన్ విధించాలని భావిస్తోంది. జర్మనీతో పాటు ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రెండోసారి లాక్‌డౌన్ విధించాయి..
ఆ దేశాలేవంటే...
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో జర్మనీతో పాటు ఫ్రాన్స్, బెల్జియం, గ్రీకు, బార్సిలోనా, యూకే, ఆస్ట్రియా, స్కాట్లాండ్, బెల్జియం, ఇజ్రాయెల్, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో రెండో సారి లాక్‌డౌన్ విధించారు. కొన్ని దేశాల్లో మొత్తం అంతటా కాకుండా.. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రల్లోనే లాక్‌డౌన్ విధించారు.
వ్యాక్సిన్ వచ్చాక కూడా లాక్‌డౌన్ ఎందుకు?
కరోనాని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ ఎన్ బయోటెక్, స్పూత్నిక్ వి అందుబాటులోకి రాగా.. మరి కొద్ది రోజుల్లో ఆక్స్‌ఫర్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్‌లు రానున్నాయి. ఒకటి, రెండు నెలల వ్యవధిలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం దేశాలు లాక్‌డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లన్ని కరోనాను సమర్థవంతంగా ఎందుర్కొగలవనే గ్యారంటీ లేదు. స్వయంగా డబ్ల్యూహెచ్‌ఓనే కోవిడ్ -19 సమర్థవంతంగా కట్టడి చేయగల వ్యాక్సిన్ రావడానికి సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రానున్న వ్యాక్సిన్‌లన్ని 6-12 నెలల వ్యవధి గడువులోనే తయారయ్యాయి. చాలా తక్కువ మంది మీదనే ట్రయల్స్ జరిపారు. అది కూడా చాలా తక్కువ రోజులపాటే. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు )
వ్యాక్సిన్ ప్రభావంపై జనాల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకా ప్రభావం ఒకవేళ 70 శాతమే ఉన్నప్పుడు... మిగతా 30 శాతం మందిలో అది పనిచేయనప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత 95 శాతం రక్షణ ఇస్తుందని ఆ కంపెనీ వారు చెబుతున్నారు. అలాగే మన దేశంలోని కో–వ్యాక్సిన్ నుంచి 70 శాతం రక్షణ కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నిబట్టి వ్యాక్సిన్ వేసిన వాళ్లలో కరోనా అస్సలు రాకుండా ఉండాలనే నియమం ఏమీ లేదు. కొంతమందిలో వ్యాక్సిన్ వేసిన తర్వాతా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సుమారు 95% ప్రొటెక్షన్ ఉంది అంటే వందలో ఐదుగురికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వాటిల్లో ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం సమర్థవంతైనది లేదు. దాంతో చాలా దేశాలు వ్యాక్సిన్ కంటే ఎక్కువగా లాక్‌డౌన్, మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి.
కేసుల పెరుగుదల-శీతాకాలం
కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజలు మాములుగా రోజువారి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కానీ సడెన్‌గా ఓ రెండు నెలల నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంది. అయితే వేసవి కారణంగా కేసుల సంఖ్య తగ్గిందని.. ప్రస్తుతం శీతకాలం కావడంతో వైరస్ విజృంభిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. ఈ పరిస్థితులు వైరస్‌కు ఎంతో అనుకూలంగా ఉండటమే కాక వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు అవకాశ ఉంటుంది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఎక్కువ వేధిస్తుంటుంది. ఫ్లూ వైరస్, కరోనా వైరస్ లక్షణాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఈ రెండు రకాల వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి శ్వాసకోశ బిందువులు, దగ్గు, కఫం ద్వారా వ్యాప్తి చెందుతూ ఇబ్బంది పెడతాయి. జలుబే కదా అని లైట్ తీసుకోవడంతో ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. (చదవండి: చలికాలంలో కరోనా పంజా)
భారత్‌లో సెకండ్‌వేవ్..
ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. భారత్‌లో కూడా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యింది.
కారణాలు
మన దగ్గర కరోనా ఫస్టవేవ్ అక్టోబర్ వరకు కొనసాగింది. ఇక అక్టోబర్ మాసం చివర్లో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమయ్యింది. అప్పటికే జనాలు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి అంశాల గురించి లైట్ తీసుకున్నారు. ఇక పండుగల కాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. గుంపులు గుంపులుగా చేరడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావచ్చని నిపుణులు హెచ్చరించారు. ఇక కరోనా కాలంలో కూడా పలు రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇది కూడా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.. (చదవండి: మళ్లీ లాక్‌డౌన్.. 3 కోట్ల మందికి ముప్పు?)
ఇండియాలో మరో మారు లాక్‌డౌన్..?
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ఈ ఏడాడి మార్చి 25 నుంచి దాదాపు 68 రోజుల పాలు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించారు. ఆయితే ఆశ్చర్య ఏంటంటే అన్‌లాక్ కాలంలో దేశంలో గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మొదటి సారి లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. కేంద్ర ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించినప్పటికి ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి రాలేదు. ఇప్పటికి పర్యాటక, విద్యా, రియల్ ఎస్టెట్, అసంఘటిత రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైనప్పటికి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు లేవంటున్నారు నిపుణులు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment