వాషింగ్టన్: కరోనా వైరస్ ఏ ముహుర్తాన బయటపడిందో కానీ.. లక్షల మందిని బలి తీసుకుంటుంది. బుధవారం నాటికి వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 7 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికోలో ఎక్కువ సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. రాయిటర్స్ విడుదల చేసిన ఓ నివేదిక భయాందోళనలు కల్గిస్తోంది. గత రెండు వారాల డాటాను ఆధారంగా చేసుకుని ఈ నివేదిక వెల్లడించింది. బుధవారం నాటికి కరోనా మరణాల సంఖ్య ఏడు లక్షలకు చేరింది. అంటే 24 గంటల వ్యవధిలో 5,900 మంది మరణించినట్లు అంచనా వేసింది. దీని ప్రకారం గంటకు 247 మంది చనిపోతున్నారు. అంటే ప్రతి 15 సెకన్లకు ఒకరు మరణిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు అత్యధికంగా 1,55,000 మంది కరోనాతో మరణించారు. ప్రజా ఆరోగ్యం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటుందని.. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై స్పందించారు. ‘కరోనా మరణాలు సంభవిస్తున్న మాట వాస్తవం. అంటే దానర్థం మేం వైరస్‌ను నియంత్రించడం లేదని కాదు. మాకు చేతనైనంత వరకు కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు అయితే కరోనాను చాలా తేలికగా తీసుకున్నారు. చివరకు ఆయనే వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి ప్రారంభంలో లాటిన్ అమెరికా ప్రాంతంలో చాలా నెమ్మదిగా వ్యాపించింది. ఈ ప్రాంతం 640 మిలియన్ల మందికి నివాసంగా ఉంది. ఇక్కడి పేదరికం, కిక్కిరిసిన నగరాల కారణంగా అధికారులు దాని వ్యాప్తిని నియంత్రించడానికి చాలా కష్టపడుతున్నారు.
యూనైటెడ్‌నేషన్స్ హ్యూమన్ సెటిల్‌మెంట్ సొల్యూషన్స్ ప్రకారం లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలలో 100 మిలియన్లకు పైగా ప్రజలు మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరంతా ఇన్‌ఫార్మల్ రంగంలో చాలా తక్కువ జీతానికి పని చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వైరస్ కట్టడి కష్టంగా మారినట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టినట్లు కనిపించిన కొన్ని దేశాల్లో ఇటీవలే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, బొలీవియా, సుడాన్, ఇథియోపియా, బల్గేరియా, బెల్జియం, ఉజ్బెకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆస్ట్రేలియా కూడా బుధవారం రికార్డు స్థాయిలో కొత్త మరణాలను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment