లాక్‌డౌన్ టైమ్‌లో బయటకు రావద్దని షాంఘై ప్రజలను హెచ్చరిస్తున్న డాగ్ రోబో
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని, జీరో కోవిడ్ విధానం పేరిట చైనా అనుసరిస్తున్న నమూనా షాంఘై నగర ప్రజల ప్రాణాలమీదకు వచ్చింది. ఒకపక్క ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కంట్రోల్ కాకపోవడంతో నగరంలో ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో కలుగుల్లో చిట్టెలుకల్లా మాడిపోతున్నాం మహాప్రభో అని ప్రజలు మూకుమ్మడి విజ్ఞాపనలు చేస్తున్నారు.
చాలా అపార్ట్‌మెంట్లలో నీళ్లు, ఆహారం వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడినట్లు కథనాలు వస్తున్నాయి. అయినా బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో చాలామంది తమ తమ బాల్కనీల్లో, కిటికీల వద్ద మనసు సాంత్వన పడేదాకా ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఫీలైన ప్రభుత్వం ‘స్వాతంత్య్రం కోసం మీ ఆత్మలు పడే తపనను నియంత్రించుకోండి’ అని హెచ్చరించింది. దీంతో మనసారా ఏడ్చే అవకాశమూ ఇవ్వరా, కిటికీల్లో కుమిలే ఛాన్సు లేదా అంటూ ఇంట్లోనే గొల్లుమంటున్నారు షాంఘై వాసులు.
డ్రోన్ పడగ నీడలో..
నగరంలో ప్రభుత్వ ఆంక్షలు సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నాయి. పొరపాటున బాల్కనీల్లో, కిటికీల్లో ఎవరైనా తల బయటపెట్టగానే ‘కంట్రోల్ ద సోల్ డిజైర్ ఫర్ ఫ్రీడం అండ్ డోంట్ ఓపెన్ విండో’ అని బ్యానర్లున్న డ్రోన్లు ముఖం ముందు ప్రత్యక్షమవుతున్నాయని ప్రజలు సోషల్ మీడియాలో వాపోతున్నారు. ప్రభుత్వం మరీ నిర్భంధంగా వ్యవహరిస్తుండడంతో షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి తిరుగుబాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయినా పెద్ద పెద్ద ప్రజాందోళనలనే లెక్కచేయని చైనా ప్రభుత్వానికి ఈ చిన్నపాటి తిరుగుబాట్లు ఏపాటి అంటున్నారు ప్రజలు.
ప్రభుత్వ నిర్బంధానికి తోడు ప్రజలకు కరోనా టెస్టులు తలనొప్పిగా మారాయి. సింగిల్ టెస్ట్ అని, డబుల్ టెస్టులని ప్రభుత్వం ఎడాపెడా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తోంది. మరి ఎంతమంది రోగులు తేలారో, వారేమయ్యారో, మిగిలినవారి పరిస్థితేంటో ఎవరికీ తెలీదు! ఎక్కడైనా కరోనా పాజిటివ్ అని తేలితే చాలు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా తీసుకుపోయి క్వారంటైన్ కేంద్రంలో పారేస్తున్నారు. కొన్నిచోట్ల చిన్న పిల్లలను సైతం తల్లిదండ్రుల దగ్గర్నుంచి లాక్కెళ్లి క్వారైంటైన్ పాలుచేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా ఫ్యామిలీ క్వారంటైన్ అమలు చేస్తున్నారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment