కరోనా సంక్షోభంతో టెక్సాస్-ఆధారిత విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయి, కుదేలైన సంస్థ దాదాపు 40వేల మందిని ఉద్యోగాలనుంచి తొలగించేందుకు నిర్ణయించింది. డెల్టా ఎయిర్‌లైన్స్1,941 మంది పైలట్లకు ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించిన మరుసటి రోజు మరో సంస్థ ఈ బాట పట్టడం గమనార్హం.
అక్టోబరులో 19వేల మంది సహా మొత్తం 40 వేల ఉద్యోగులను తగ్గించుకోనున్నామని అమెరికన్ ఎయిర్లైన్స్ మంగళవారం తెలిపింది. యూనియన్ కార్మికులు 17500 మంది, 1600 మంది పైలట్లు, 8100 మంది విమాన సహాయకులు, మేనేజ్మెంట్ స్థాయిలో మరో 11,500 మంది ఇందులోఉంటారని తెలిపింది. మరో ఆరునెలల పాటు సిబ్బంది జీతాల చెల్లింపు, తదితర అవసరాల నిమిత్తం ఫెడరల్ ప్రభుత్వం మరో 25 బిలియన్ డాలర్లను విమానయాన సంస్థలకు ఇస్తే తప్ప ఈ తొలగింపులను నివారించే పరిస్థితి లేదని తెలిపింది.
కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు,సిబ్బంది వేతనాలు, తదితర అవసరాల నిమిత్తం మార్చిలో అమెరికా ప్రభుత్వం నుంచి 25 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని విమానయాన సంస్థలు అందుకున్నాయి. అయితే ఆ తరువాత కూడా విమాన సేవల పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో మరో 25 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈఓ డౌపార్కర్, ప్రెసిడెంట్ రాబర్ట్ ఐసోమ్ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కొంతమంది ఉద్యోగులు బైఅవుట్స్, ముందస్తు పదవీ విరమణ, దీర్ఘకాలిక సెలవులకు అంగీకరించారనీ, అయినా కోతలు తప్పడం లేదని పేర్కొన్నారు.
140,000 మంది ఉద్యోగులతో ఉన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ అక్టోబరు నాటికి లక్ష కన్నా తక్కువ ఉద్యోగులకే పరిమితం కానుంది. అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తికి కొన్నివారాల తరువాత, ఏప్రిల్ నాటికి 95 శాతం విమాన ప్రయాణాలు క్షీణించాయి. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నా, గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పతనం నమోదైంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్తితిలో అమెరికా విమానయాన సంస్థలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు బాటపడుతున్నాయి. మరోవైపు మహమ్మారి సృష్టించిన మాంద్యంపై పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయ్నతాలు, నాలుగు రోజుల రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతున్న క్రమంలో ఈ ప్రకటన రావడం విమానయాన సంస్థల సంక్షోభానికి అద్దం పడుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment