కాలిఫోర్నియా : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సంక్షోభం భారీ ఉద్యోగాల కోతకు దారి తీస్తోంది. తాజాగా అమెరికా వ్యాపార దిగ్గజం డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 28వేల థీమ్ పార్క్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ మేరకు మంగళవారం డిస్నీ ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
కోవిడ్-19 ప్రభావం తమ వ్యాపారంపై పడటంతో ఉన్న ఉద్యోగుల్లో నాల్గవ వంతు 28 వేల మందిని తొలగిస్తున్నామని డిస్నీ పార్కు ఛైర్మన్ జోష్ డి అమారో తెలిపారు. ఇందులో 67 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారన్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులు ఎవరినీ తీయకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ అవిరామంగా కృషి చేసింది, ఖర్చులు తగ్గించుకున్నాం, కొన్ని కార్యక్రమాలను నిలిపివేశాం అయినా ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా, పారిస్, షాంఘై, జపాన్ హాంకాంగ్‌లోని డిస్నీ థీమ్ పార్కులు ఓపెన్ చేసినా లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ థీమ్ పార్కుల్లో ఉద్యోగుల తొలగింపు అనంతరం ఉద్యోగుల సంఖ్య 1,10,000 నుంచి 82,000లకు తగ్గుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment