సీసీ టీవీ దృశ్యం
బ్యాంకాక్ : బంగారు షాపునకు కాపలాగా ఉన్న ఓ కుక్క దొంగ పడి దోచుకుంటుంటే అరవటం మానేసి, గురకలు పెట్టి నిద్రపోయింది. ఆ షాపుతో తనకు అస్సలు సంబంధం లేనట్టు ప్రవర్తించింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం.. థాయ్‌లాండ్, చియాంగ్ మాయ్ సిటీలోని ఓ బంగారం షాపులోకి నెత్తిన నల్ల టోపీ, మూతికి మాస్క్‌తో ఓ దొంగ చొరబడ్డాడు. యజమానికి గన్ను చూపించి, బెదిరించి బంగారు నగలున్న సంచిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే షాపునకు కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేమీ పట్టనట్లు గురకపెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ దొంగ మళ్లీ షాపు దగ్గరకు వచ్చాడు. జరిగిందంతా ఓ నకిలీ దొంగతనమని, షాపుల్లోని భద్రతను పరీక్షించటానికి పోలీసులు ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్‌లో భాగంగా దొంగతనానికి వచ్చానని చెప్పాడు. షాపులో నిజమైన దొంగతనం జరిగినప్పుడైనా కుక్క మేలుకుంటుందా అని ప్రశ్నించాడు. షాపు యజమాని దీనికి సమాధానం ఇస్తూ.. ‘‘ నిజం చెప్పమంటారా?.. నా ఉద్ధేశ్యంలో మా కుక్క మనుషుల భాషను అర్థం చేసుకుందని అనుకుంటున్నా.
అది ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది. నేను ఏ చిన్న శబ్ధం చేసినా ఊరుకోదు. మీరు సీసీటీవీ కెమెరాల్లో నా హావభావాలను గమనించండి. నేనేమైనా శబ్ధం చేశానేమో చూడండి! అది ఫేక్ అని నాకు తెలిసిపోయింది కాబట్టే నేను ఊరికే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే దొంగ వేషంలో వచ్చిన పోలీసుకు ఆ కుక్క అంతకు ముందే తెలుసునని, చాలా సార్లు కలుసుకున్నారని షాపు యజమాని చెప్పాడు. ఏది ఏమైనా కుక్క అలా గుర్రుపెట్టి నిద్రపోవటంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తెలిసిన వ్యక్తులు షాపును దోచుకుపోతే చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ షాపులో దొంగ పడితే అలా గురకపెట్టి నిద్రపోతావా.. సిగ్గులేదు?’’ అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment