వాషింగ్టన్: తమ ఈమెయిళ్లు హ్యాకయ్యాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ వెల్లడించింది. ఇది ఇరాన్ పనేనని ఆరోపించింది. కీలక అంతర్గత సమాచారాన్ని దొంగిలించి బహిర్గతం చేశారని పేర్కొంది. అయితే ఇందుకు కచ్చితమైన ఆధారాలను మాత్రం ట్రంప్ బృందం వెల్లడించలేదు.
అమెరికా ఎన్నికలు, ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైబర్ దాడులకు పాల్పడుతోందని మైక్రోసాఫ్ట్ తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు వచ్చిన మరుసటిరోజే ట్రంప్ ప్రచార బృందం మెయిళ్లు హ్యాకవడం గమనార్హం. ట్రంప్ టీమ్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.
తమ దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. మరోవైపు ట్రంప్ టీమ్ ఆరోపణలను ఇరాన్ రాయబార అధికారులు ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపింది. కాగా, అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా ఇరాన్ ఆన్‌లైన్ కార్యకలాపాలు పుంజుకున్నట్లు మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment