హెజ్‌బొల్లాపై యుద్ధంలో ఎనిమిది మంది సైనికులు మృతి
టెల్ అవీవ్: దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్‌కు ప్రాణనష్టం సంభవించింది. హెజ్‌బొల్లాపై యుద్ధంలో తమ జవాన్లు ఎనిమిది మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారులు బుధవారం ప్రకటించారు. రెండు వేర్వేరు ఘటనల్లో వీరు మృతి చెందినట్లు తెలిపారు. తాము వెనుకడుగు వేయబోమని, హెజ్‌బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
మరోవైపు హెజ్‌బొల్లా సైతం వెనక్కి తగ్గడంలేదు. ఇజ్రాయెల్ సేనలపై విరుచుకుపడుతోంది. లెబనాన్–ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ పదాతి దళానికి అండగా యుద్ధ ట్యాంకులు సైతం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు కొందరు గాయపడ్డారని హెజ్»ొల్లా తెలియజేసింది.
50 గ్రామాలు, పట్టణాలు ఖాళీ!
దక్షిణ లెబనాన్ మొత్తం యుద్ధక్షేత్రంగా మారిపోవడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలు, పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించారు. దీంతో జనం సురక్షిత ప్రాతాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే వేలాది మంది తరలిపోయారు.
దాదాపు 50 గ్రామాలు, పట్ణణాలు ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం. హెజ్‌బొల్లా కబంధ హస్తాల నుంచి లెబనాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికే సైనిక చర్య ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. లక్ష్యం నెరవేరేదాకా దాడులు ఆగవని అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment