![Electric flying car by Alef receives approval for test flights - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/18/1071604.gif.webp?itok=3GAUEReE)
నగరాల్లో విపరీతమైన వాహనాల రద్దీ, అధ్వాన్నమైన రహదారుల వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు. ట్రాఫిక్ జంఝాటం లేకుండా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వేగంగా దూసుకెళ్తే బాగుంటుందని అనుకోనివారు ఉండరు. అలాంటివారి కోసం అమెరికాలోని కాలిఫోరి్నయాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఎగిరే కారును(ఫ్లైయింగ్ కారు) అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 2015లో మొదలైన ఈ ఆలోచనకు పదునుపెట్టిన అలెఫ్ కంపెనీ 2019 నాటికి ఎగిరే కారును తయారు చేసింది. మోడల్–ఎ ఫ్లైయింగ్ కారును ఆవిష్కరించింది.
కొన్ని రకాల పరీక్షల తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికా ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్‌ఏఏ) ఈ కారుకు స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ అందజేసింది. అంటే పరిమిత ప్రాంతాల్లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించడానికి, దీనిపై పరిశోధన–అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం అనుమతి మంజూరు చేసింది. ఇదొక టరి్నంగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎగిరే కారు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సాంకేతికపరమైన, చట్టపరమైన ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కారులో ఆకాశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.
విడిభాగాల లభ్యత ఎలా
ఎక్కువ సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు విస్తృతంగా అందుబాటులో లేవని అలెఫ్ ఏరోనాటిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిమ్ డుఖోవ్‌నీ చెప్పారు. వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. ఉదాహరణకు ఫ్లైయింగ్ కారుకు ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి హైలీ స్పెషలైజ్డ్ ప్రొపెల్లర్ మోటార్ సిస్టమ్స్ అవసరమని, అలాంటివి తయారు చేసుకోవడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ఎగిరే కారు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వస్తుందన్నది దాని పరిమాణం, బరువు, ధర, అది ఎంతవరకు సురక్షితం అనేదానిపైనా ఆధారపడి ఉంటుందన్నారు.
సేఫ్టీ ఫీచర్ల మాటేమిటి
అలెఫ్ కంపెనీ మోడల్–ఎ కార్ల విక్రయాల కోసం ఇప్పటికే ప్రి–ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఒక్కో కారు ధరను 3 లక్షల డాలర్లుగా (రూ.2.46 కోట్లు) నిర్ధారించింది. మోడల్–ఎ అనేది అ్రల్టాలైట్, లో స్పీడ్ వెహికల్. చట్టప్రకారం ఈ మోడల్ కారు గోల్ఫ్ కార్ట్‌లు, చిన్నపాటి విద్యుత్ వాహనాల విభాగంలోకి వస్తుంది. ఫ్లైయింగ్ కారు కేవలం గాల్లో ఎగరడమే కాదు, రోడ్లపై కూడా సాధారణ వాహనాల్లాగే ప్రయాణిస్తుంది. దానికి అనుమతి రావాలంటే ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే సాధారణ కార్లలో ఉండే సేఫ్టీ ఫీచర్లన్నీ ఉండాలి. అలెఫ్ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్–ఎ కారు రోడ్లపై ప్రయాణానికి అంతగా సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది.
భారీ శబ్ధాలు, కాలుష్యం
ఫ్లైయింగ్ కార్లు పరిమితమైన ఎత్తులోనే ఎగురుతాయి. భారీ శబ్ధాలు, కాలుష్యం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తప్పవు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం శబ్ధం వెలువడని ఫ్లైయింగ్ కార్లు డిజైన్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. రోడ్లపై వాహనాలు ఢీకొంటున్నట్లుగానే గగనతలంలో వేగంగా దూసుకెళ్లే ఫ్లైయింగ్ కార్లు పరస్పరం ఢీకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎగిరే కార్లు భవనాలను ఢీకొని నేలకూలడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే నష్టం భారీగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆకాశంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో ఎగిరే కార్ల రాకపోకల కోసం శాస్త్రీయమైన మార్గసూచిని రూపొందించాలి.
ధనవంతులకే సాధ్యమా?
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎగరే కార్ల ధరలను సంపన్నులే భరించగలరు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటివి కొనేసే స్తోమత కొందరికే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు, లైసెన్స్ ఫీజులు కూడా తక్కువేమీ కాదు. విమాన ప్రయాణం ప్రారంభమైన తొలి రోజుల్లో ధనవంతులకే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైయింగ్ కార్ల విషయంలోనూ అలాంటి పరిణామం సాధ్యపడొచ్చు. ప్రభుత్వాలే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఈ కార్లను ప్రవేశపెడితే సామాన్య ప్రజలు సైతం ఆకాశయానం చేయొచ్చు.
నడపడానికి లైసెన్స్ ఎవరిస్తారు?
కార్లు నడపాలన్నా, విమానాలు నడపాలన్నా కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. ఫ్లైయింగ్ కార్లు నడపడానికి కూడా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ శిక్షణ ఎవరిస్తారు? లైసెన్స్‌లు ఎవరు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలదే తుది నిర్ణయం. నేలపై, గాలిలో నడపడానికి డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. ఫ్లైయింగ్ కార్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి రవాణా , పౌర విమానయాన శాఖ సమన్వయంతో పని చేయాల్సి రావొచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment