కొలంబో: రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం(జులై 13న) ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం(జులై 13) అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటబయ రాజపక్స.. దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో..
ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు నిరసనకారులు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.
నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు.
ఈ సాయంత్రంలోగా అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమారు 22 మిలియన్ల(2 కోట్ల 10 లక్షల దాకా) జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment