ఫెరారీ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన కార్లను డిజైన్ చేసిందీ కంపెనీ. ముఖ్యంగా కారు డోర్లు పక్షి రెక్కల్లా పైకి తెరుచుకునేట్టు రూపొందించిన డిజైన్ అప్పట్లో ఓ సంచలనం. మరి అచ్చం అలాగే ఉండే ఓ లగ్జరీ బోట్‌ను డిజైన్ చేస్తే! ‘లాజ్జ్జరిని డిజైన్ స్టూడియో’ కంపెనీ ఇదే చేసి చూపించింది. ఫెరారీ కార్లలా అద్భుతమైన లగ్జరీ సూపర్ యాచ్ డిజైన్‌ను రూపొందించింది. ఈ యాచ్‌ను ‘ఫెరారీ ఆఫ్ ద సీ’ అంటోంది. దీనికి గ్రాన్ టూరిస్మో మెడిటెర్రేనియా అని పేరు పెట్టింది.
ఈ సూపర్ యాచ్ పొడవు దాదాపు 26 మీటర్లు. గంటకు 136 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ యాచ్ నడవడానికి 22 టన్నుల బరువుండే 6,600 బ్రేక్–హార్స్ పవర్ ఇంజిన్లను వాడుతున్నారు. యాచ్‌లో కింద, పైన రెండు క్యాబిన్లు ఉంటాయి. కింది క్యాబిన్‌లో పెద్ద లివింగ్ రూమ్, ఇందులోనే ఓ కిచెన్ కూడా ఉంటుంది. అలాగే మూడు, నాలుగు బెడ్‌రూమ్‌లకు స్థలం కూడా ఉంటుంది. పై క్యాబిన్‌లో రెండో లివింగ్ ప్రాంతం, యాచ్ నడిపే కెప్టెన్ క్యాబిన్ ఉంటాయి. యాచ్ వెనక గ్యారేజ్ ఉంటుంది. దీన్నే సన్ డెక్‌గా కూడా వాడుకోవచ్చు. అంటే బయటకు వచ్చి సూర్యుడి వేడిని ఆస్వాదించవచ్చు. ఈ సూపర్ యాచ్ ధర రూ. 74 కోట్లు. ప్రస్తుతానికైతే ఇది డిజైన్ మాత్రమే. లాజ్జ్జరిని కంపెనీ గతంలో కూడా రకరకాల యాచ్ డిజైన్లను రూపొందించింది. హంసలా, షార్క్ చేపలా ఉండే డిజైన్లతో పాటు యాచ్ మధ్యలో ఖాళీ ప్రదేశం (రంధ్రం) ఉండేలా రకరకాల డిజైన్లను చేసి అబ్బురపరిచింది.
–సాక్షి,సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment