అఫ్గానిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.
వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్‌లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్‌లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్‌లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్‌లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment