సాక్షి, హైదరాబాద్: పర్యాటక రంగం తిరిగి రెక్కలు విప్పుకుంటోంది. ఏడాదికి పైగా నిలిచిపోయిన రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి షికాగోకు గత నెలలో రెగ్యులర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గల్ఫ్‌దేశాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. తాజాగా పర్యాటకుల స్వర్గధామం మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గో ఎయిర్‌కు చెందిన ఫ్లైట్ ఏ8(1533) గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మాల్దీవుల్లోని మాలెకు బయలుదేరింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి ఎ8(4033) విమాన సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ –మాలే మధ్య ఈ విమాన సర్వీసులు ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం రాకపోకలు సాగిస్తాయి.
పెరుగుతున్న సర్వీసులు..
కోవిడ్ అనంతరం నెలకొన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్‌కు ముందు ప్రతిరోజు 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉండగా ఇప్పుడు 2,500 నుంచి 3,000 మంది రాకపోకలు సాగిస్తున్నాయి. ‘అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేస్తే పూర్తిస్థాయిలో విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి, బెంగళూర్ తదితర ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి.
అడ్వెంచర్ టూర్స్@ మాలే
మాల్దీవులు అనగానే అడ్వెంచర్ టూర్స్ గుర్తుకొస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చేస్తారు. రకరకాల జలకాలాటలతో గడిపేస్తారు. అందమైన ప్రకృతి దృశ్యాలు సైతం కనువిందు చేస్తాయి. అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులే కాదు. హనీమూన్‌కు వెళ్లే జంటలకు సైతం మాల్దీవులు ఎంతో ఇష్టమైన ప్రదేశం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్‌బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జలక్రీడలను ఆస్వాదించవచ్చు. హైదరాబాద్– మాలేలను కలిపే ఈ విమాన సర్వీసు కోసం నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల్లో మాలేకు చేరుకోవచ్చు.’ అని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ అన్నారు. గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిక్ ఖోనా, హైదరాబాదీల కోసం గో ఎయిర్ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment