కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి సరిగా తిండి దొరకని దీన స్థితికి చేరుకుంది శ్రీలంక. ప్రజాగ్రహం కట్టలు తెంచుకున‍్న నేపథ్యంలో దేశం విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీలంక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు గొటబయ. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తాను పదవి చేపట్టక ముందే ఏళ్ల తరబడి కొనసాగిన ఆర్థిక అవకతవకల వళ్లే ఇది జరిగిందని ఆరోపించారు.
సింగపూర్ వెళ్లిన తర్వాత తన రాజీనామాను స్పీకర్‌కు పంపించారు గొటబయ. దీంతో ఆయన రాజీనామాను పార్లమెంటు శుక్రవారం ఆమోదించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గొటబయ రాజీనామాను చదివి నిపించారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ధమ్మిక దసనయాకే. ఈ లేఖ ద్వారా దేశంలో నెలకొన్ని పరిస్థితులను వివరించారు గొటబయ. 'కొన్నేళ్లుగా అసమర్థ పాలన, ఆర్థిక అవకవతకల కారణంగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దాంతో పాటు కోవిడ్-19 శ్రీలంక పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ పర్యాటకులు రాకుండా చేసింది. ఆ సంక్షోభాన్ని తప్పించేందుకు.. సమైఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలను ఆహ్వానించటం సహా అన్ని రకాల చర్యలను చేపట్టానని నమ్ముతున్నా.' అని పేర్కొన్నారు.
బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక..
అధ్యక్ష పదవికి నామినేషన్లను ఆమోదించేందుకు వచ్చే మంగళవారం సమావేశం కానుంది శ్రీలంక పార్లమెంట్. బుధవారం ఓటింగ్ ద్వారా దేశాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం ప్రధాని రణీల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు.
ఇదీ చూడండి: కష్టాల్లో ఉన్న లంకను భారత్ ఆదుకుంటుంది: హైకమిషనర్
Comments
Please login to add a commentAdd a comment