జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం 15 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జుమా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి. వారం క్రితం ప్రారంభమైన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఫలితంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 మందికి పైగా మరణించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఈ నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు.
జుమాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో ప్రధానంగా ముగ్గురు భారతీయ సోదరులు ఉన్నారు. వీరిని గుప్తా సోదరులుగా పిలుస్తారు. జుమాకు, ఈ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉందని.. అధ్యక్షుడు వీరికి దేశ వనరులను దోచి పెట్టాడని ఆరోపణలు వెలుగు చూశాయి. ఒకానొక సమయంలో గుప్తా బ్రదర్స్ జుమా ప్రభుత్వ పాలసీలను నిర్ణయించేవారని ఆరోపణలు ఉన్నాయి. ఇక జుమా పదవి నుంచి దిగిపోయిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దేశం విడిచి పారిపోయారు.
జుమాపై ఉన్న కేసేంటి..
జుమాపై భారీ అవినీతి కేసులు నమోదయ్యాయి. దీనిలో ఒకటి 1999నాటి 2 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల ఒప్పందం కేసు కాగా.. మరొకటి 2009-18 వరకు జుమా పరిపాలన కాలంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు సంబంధించినది. మొదటి కేసులో జుమా ఆరోపణలను తోసిపుచ్చగా.. రెండో కేసులో విచారణకు అంగీకరించడం లేదని అధికారులు తెలిపారు.
జుమాపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న పానెల్ జుమా, ముగ్గురు భారతీయ సోదరులతో కలిసి భారీ అవినీతికి పాల్పడినట్లు వెల్లడించింది. గుప్తా బ్రదర్స్‌గా పేరు గాంచిన అతుల్ గుప్తా, అజయ్ గుప్తా, రాజేస్ గుప్తాలతో కలిసి జుమా దేశ వనరులను కొల్లగొట్టారని తెలిపింది. గుప్తా సోదరులకు, జుమాకు మంచి సంబంధలుండేవని.. ఒకానొక దశలో జుమా ప్రభుత్వ పాలసీలను ఈ సోదరులే నిర్ణయించేవారని పానెల్ తెలిపింది. ఇక 2018లో జుమాను పదవి నుంచి తొలగించిన తర్వాత గుప్తా సోదరుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా విడిచి పారిపోయారు.
జుమా-గుప్తా బంధం ‘జుప్తా’
జుమాకు, గుప్తా సోదరులకు తొలుత 2015-16 కాలంలో పరిచయం ఏర్పడింది. సహారా కంప్యూటర్ ఈవెంట్ సందర్భంగా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వత కొద్ది కాలంలోనే అది బలమైన బంధంగా మారింది. వీరి బంధాన్ని విమర్శకులు జుప్తా(జుమా+గుప్తా= జుప్తా)గా పిలిచేవారు.
2016లో గుప్తా సోదరులపై బలమైన అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. గుప్తా బ్రదర్స్ అప్పటి ఉప ఆర్థిక మంత్రిని కలిసి.. తమ వ్యాపార ప్రయోజనాలను విస్తరించుకునే అవకాశం కల్పిస్తే.. అతడికి ఆర్థిక మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక సదరు మంత్రికి 600 మిలియన్ రాండ్లను చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జుమా పదవి కోల్పోవడానికి గుప్తా బ్రదర్సే కారణమని మాజీ ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోర్థాన్ ఆరోపించారు.
‘జుప్తా’ పతనం..
2017లో దాదాపు లక్ష ఈ మెయిళ్లు లీక్ అయ్యాయి. ఇవన్ని ప్రధానంగా గుప్తా సోదరులకు సంబంధించినవే. జుమా ప్రభుత్వాన్ని గుప్తా బ్రదర్స్ ఎలా ప్రభావితం చేశారో ఈ ఈమెయిళ్లు తెలుపుతున్నాయి. దీనికి ముందు 2013లో గుప్తా సోదరులు చేసిన ఓ పని దక్షిణాఫ్రికా జనాల మనోభావాలను దెబ్బ తీసింది. అదేంటంటే దేశంలోని ముఖ్యులకు సంబంధించిన ఓ మిలటరీ ఎయిర్‌బేస్‌ని గుప్తా సోదరులు తమ వ్యక్తిగత పనులకు వాడుకోవడం తీవ్ర ఆగ్రహాన్ని రేకేత్తించింది. ఈ క్రమంలో ఈమెయిళ్లు లీక్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. జుమాకు, గుప్తా కుటుంబానికి వ్యతిరేకంగా నిరసన చేశారు.
2018, ఫిబ్రవరిలో విపక్షాలు జుమాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాంతో జుమా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆయనను బలవంతంగా అధ్యక్ష పదవి నుంచి దింపేసింది. గుప్తా సోదరులు దుబాయి, యూఏఈ పారిపోయారు.
ఎవరీ గుప్తా సోదరులు..
గుప్తా సోదరులు పశ్చిమ ఉత్తరప్రదేశ్ సహరాన్‌పూర్‌కు చెందిన వారు. వీరికి ఓ చిన్న కుటుంబ వ్యాపారం ఉండేది. ఈ క్రమంలో వీరిలో పెద్దవాడైన అతుల్ గుప్తా 1993లో దక్షిణాఫ్రికా వెళ్లాడు. వర్ణవివక్ష ముగిసిన తర్వాత దేశం ప్రపంచానికి ఆహ్వానం పలికిన సమయంలో అతుల్ గుప్తా దక్షిణాఫ్రికా వెళ్లాడు. మిగతవారు ఆయనను అనుసరించారు.
కొన్ని నివేదికల ప్రకారం గుప్తా సోదరులు మొదట్లో దక్షిణాఫ్రికాలో కార్లో బూట్లు తీసుకెళ్లి అమ్మేవారు. ఆ తర్వాత వారు సహారా కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించారు. వ్యాపారం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వారు రాజకీయ సంబంధాలను పెంచుకున్నారు.. వారు తమ వ్యాపారాన్ని కంప్యూటర్ల నుంచి విమాన ప్రయాణం, శక్తి, మైనింగ్, టెక్నాలజీ, మీడియా రంగాలకు విస్తరించారు. చివరకు దేశ పాలసీలను నిర్ణయించే వరకు ఎదిగారు.
Comments
Please login to add a commentAdd a comment