హాలోవీన్ డే అంటే దెయ్యాల ఉత్సవం. గతంలో ఈ పండుగ గురించి భారతీయులకు పెద్దగా తెలియదు. అయితే కాలానుగుణంగా ఈ విదేశీ పండుగ మనదేశంలోనూ అక్కడక్కడా జరుపుకుంటున్నారు.
ప్రతియేటా అక్టోబర్ 31న హాలోవీన్ డే జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలో ప్రజలు దెయ్యాల వేషం వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అతీంద్రియ శక్తులతో ఈ పండుగకు ముడిపెడతారు. ఈ హాలోవీన్ పండుగ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనే కాకుండా మరికొన్ని పట్టణాల్లో కూడా హాలోవీన్ పార్టీలు నిర్వహిస్తున్నారు.
కొన్ని చోట్ల పాఠశాలల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ హాలోవీన్ పండుగ వెనుక అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పండుగకు రెండు వేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. ఈ ఉత్సవం ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, నార్తర్న్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ పండుగను సంహైన్ అని కూడా పిలుస్తారు.
సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో హాలోవీన్‌ను పౌర్ణమి నాడు వచ్చినట్లు చూపిస్తారు. అయితే, హాలోవీన్ సమయంలో పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది. 2020లో పౌర్ణమి నాడు హాలోవీన్ వచ్చింది. తదుపరి హాలోవీన్ పౌర్ణమి రాత్రి కోసం చాలా సంవత్సరం వేచి ఉండాలి. హాలోవీన్ రోజున, పిల్లలు వివిధ రకాల దుస్తులు ధరించి సమీపంలోని ఇళ్లకు వెళతారు. క్యాండీలను పంచిపెడతారు.
ఈ ఆచారం ప్రారంభమైన నాటి రోజుల్లో రాత్రి సమయంలో దెయ్యాలు భూమిపై సంచరిస్తాయని నమ్మేవారు. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచడం మొదలుపెట్టారు. దీని తరువాత, చర్చిలలో ప్రార్థన చేసే అలవాటు ప్రారంభమైంది. క్రమంగా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ప్రారంభించారు.
హాలోవీన్ రోజున నలుపు ,నారింజ రంగులతో అలంకరించుకుంటారు. నారింజ రంగు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు శరదృతువును సూచిస్తుంది. నలుపు రంగు అనేది భయానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శీతాకాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు రంగులు రుతువులలో మార్పులు, జీవితం ,మరణాన్ని సూచిస్తాయి.
ఇది కూడా చదవండి: పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..
Comments
Please login to add a commentAdd a comment