![Henley Global Citizen Report 2022 Super Rich Person Leaving Own Country - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/4/1441.jpg.webp?itok=Uvi2qk-Z)
ఉద్యోగం కోసం ఉపాధి కోసం వలస వెళ్లడం మనకు తెలుసు.. మరి ఇక్కడ కోటీశ్వరులే వలస వెళ్లిపోతున్నారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలకు చెందిన కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది. ఈ ఏడాది 88 వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (కనీసం రూ.8 కోట్ల చరాస్తులు కలిగిన వ్యక్తులు) స్వదేశాలను వీడొచ్చని హెన్లే గ్లోబల్ సిటిజన్స్ నివేదిక అంచనా వేసింది. ఇంతకీ వీరందరూ తమ స్వదేశాలను ఎందుకు వీడుతున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఓసారి చూద్దామా..
వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య
రష్యాకు కోటీశ్వరుల బైబై
ఈసారి అత్యధికంగా కోటీశ్వరులు వీడుతున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారి నుంచి బయటపడేందుకు రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని సంపన్నులు తమ దేశాలను వీడుతున్నారని హెన్లే విశ్లేషించింది. ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి ఏకంగా 15 వేల మంది, ఉక్రెయిన్ నుంచి 2,800 మంది విదేశాలకు తరలిపోవచ్చని పేర్కొంది. ఇటు భారత్ నుంచి కూడా 8 వేల మంది విదేశాలకు వెళ్లిపోవచ్చని అంచనా వేసింది.
మిలియనీర్ల స్వర్గధామం యూఏఈ
అత్యధిక మంది కోటీశ్వరులు స్థిరపడేందుకు ఎంపిక చేసుకునే దేశాల జాబితాలో యూఏఈ తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా 4 వేల మంది తమ గమ్యస్థానంగా యూఏఈని ఎంపిక చేసుకోవచ్చని హెన్లే పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు యూఏఈ అనుసరిస్తున్న వలస విధానాలు ఇందుకు కొంత కారణం కావొచ్చని వివరించింది.
వలసలు ఎందుకు?
నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెడితే విదేశీ పౌరసత్వం లభిస్తుందనో లేదా శాశ్వత నివాస హక్కు పొందవచ్చనో నచ్చిన దేశానికి కోటీశ్వరులు క్యూ కడుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు మెరుగైన భద్రత, రక్షణ కోరుకునే వారు, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించాలనుకునే వారు, ప్రభుత్వాల అణచివేత ధోరణులు లేదా అవినీతి ప్రభుత్వాల బారి నుంచి బయటపడాలనుకునే వ్యక్తులు, ఉన్నతవిద్య, ప్రపంచస్థాయి వైద్యం పొందాలనుకొనే మిలియనీర్లు కూడా సాధారణంగా వలసల వైపు మొగ్గు చూపుతుంటారని హెన్లే అండ్ పార్ట్‌నర్స్ విశ్లేషించింది.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment