బీజింగ్: డ్రాగన్ కంట్రీపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. మూడు రెట్లు కొత్త కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ నుంచి ప్రమాదకారిగా భావిస్తున్న రెండు ఉప వేరియెంట్లు శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేసుల సంఖ్య అమాంతం పెరగడానికి కారణంగా తేలింది. ఈ క్రమంలో పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ విధించగా.. తీవ్ర ప్రభావం చూపించే వేరియెంట్లు కావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్ నుంచి బీఎఫ్.7, బీఏ.5.1.7 ఉప వేరియెంట్లు.. వాయవ్య చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం నమోదు అయిన కేసుల సంఖ్య గణనీయంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వీటి బారిన పడ్డ చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారు. అదే సమయంలో బీఏ.5.1.7 సబ్ వేరియెంట్ కేసులు తొలిసారి చైనా గడ్డపై వెలుగు చూడడం గమనార్హం. ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ కూడా ధృవీకరించింది. షాంగైతో పాటు చాలా రీజియన్లలో సోమవారం నుంచే కఠిన లాక్‌డౌన్‌ను మళ్లీ అమలు చేస్తున్నారు.
ఒమిక్రాన్ ఉప వేరియెంట్ BF.7. అత్యంత ప్రమాదకరమైందని, ఇన్‌ఫెక్షన్ రేటు వేగంగా.. అధికంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పెనుముప్పునకు దారి తీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో.. చైనాలోనే ఈ ప్రమాదకారిక ఉప వేరియెంట్ ప్రతాపం చూపిస్తుండడం గమనార్హం. అయితే ఇది చైనాకు మాత్రమే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచాన్ని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో.
ప్రపంచంలోనే కట్టుదిట్టమైన కఠోర కరోనా ఆంక్షల్ని అమలు చేస్తోంది చైనా. సరిహద్దుల్ని మూసేసి.. జీరో కోవిడ్ పాలసీ విధానంతో ప్రజలు ఇబ్బంది పడినా.. విమర్శలు ఎదుర్కొన్నా కూడా కరోనా కట్టడికి యత్నిస్తోంది. అయినప్పటికీ కొత్త వేరియెంట్లు విరుచుకుపడడం గమనార్హం. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 20వ పార్టీ కాంగ్రెస్ నేపథ్యంలో.. కరోనా విజృంభిస్తోందన్న కథనాలు చైనాను మాత్రమే కాదు.. ఇతర దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment