జీరో టోలరెన్స్ పేరిట చైనా చేపట్టిన చర్యలేవీ సత్పలితాలను ఇవ్వడం లేదు. సరికదా.. గత మూడు వారాలుగా కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. తాజాగా.. ఒక్కరోజులో ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి. బయటి ప్రపంచం దృష్టిలో.. కరోనా మొదలైనప్పటి నుంచి చైనాలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే!.
చైనా China లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆదివారం బులిటెన్‌లో 1,337 కేసులు, సోమవారం బులిటెన్‌లో 3,507 కేసులు, మంగళవారం ఉదయం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్.. ఏకంగా 5,280 కేసుల్ని చూపించింది. ఈశాన్య ప్రావిన్స్ అయిన జిలిన్‌లోనే మూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ కమీషన్ వెల్లడించింది. అయితే పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని జిలిన్ గవర్నర్ ప్రకటించినప్పటికీ.. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చైనా వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జిలిన్, ఉత్తర కొరియాకు సరిహద్దు ప్రాంతం. అందుకే ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణాలను కొన్నాళ్లపాటు నిషేధించింది చైనా.
జీరో టోలరెన్స్ అంటే..
కఠినంగా కట్టడి చేయడం, పెద్ద ఎత్తున్న పరీక్షలు నిర్వహించడం.. ఇది జీరో టోలరెన్స్‌లో భాగంగా చైనా అనుసరిస్తున్న విధానం. రెండు సంవత్సరాల మూసేసిన సరిహద్దులు, సామూహిక పరీక్షలు, లాక్‌డౌన్‌లు, నిర్బంధాలు అమలు చేసింది. ఎక్కడికక్కడే కేసుల్ని కట్టడి చేసింది. ఈ క్రమంలో హేయమైన చర్యలకూ పాల్పడి.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ, జీరో టోలరెన్స్‌ను పటాపంచల్ చేస్తూ.. వైరస్ విజృంభిస్తోంది ఇప్పుడు.
దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ ఎదుర్కొంటోంది. 2019లో వుహాన్‌లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కూడా జీరో కొవిడ్ స్ట్రాటజీతో.. కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్ ఒలింపిక్స్ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో జనసంచారం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తోంది.
ఇది కొత్త వేరియెంట్లు అనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. సైంటిస్టులు మాత్రం అది ఒమిక్రాన్ stealth omicron అయి ఉండొచని అభిప్రాయపడుతున్నారు. ఇది ఏ తరహా వేరియెంట్ అన్నదానిపై చైనా ఆరోగ్య విభాగం స్పష్టత ఇవ్వడం లేదు.
భారీ ఎఫెక్ట్
కేసులు పెరిగిపోతుండడంతో.. 11 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న టెక్‌హబ్ షెంజెన్‌లో బయట మనిషి కనిపించడం లేదు. మరోవైపు లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగానూ ప్రభావం పడుతోంది. మంగళవారం ఉదయం.. కరోనా ఎఫెక్ట్‌తో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయ్యింది. అక్కడా కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. బీజింగ్, షాంగై విమానశ్రయాలకు భారీగా విమానాలు రద్దు అయ్యాయి. షాంగైలోనూ లాక్‌డౌన్ కఠినంగా అమలు అవుతోంది.
మరణాల గోప్యత
కరోనా కేసుల వెల్లడి విషయంలో చైనా చాలాకాలం పాటు గమ్మున ఉండిపోయింది. కొన్ని నెలల కేసుల వివరాలను చైనా బయటకు రిలీజ్ చేయకపోవడం విశేషం. ఇక మరణాల సంగతి సరేసరి. ఇప్పటిదాకా కేవలం ఐదు వేల మరణాలు నమోదు అయ్యాయని చెప్తోంది. అత్యధిక జనాభా ఉన్న చైనాలో.. ఇది నమ్మశక్యంగా ఉందంటారా?. ఏది ఏమైనా జీరో టోలరెన్స్‌ను ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్న చైనా.. ఇప్పుడు కరోనా కేసుల్ని కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా తడబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment