టెహ్రాన్: అంతర్జాతీయ క్రీడా వేదికలో హిజాబ్ లేకుండా పాల్గొని.. వార్తల్లో ప్రముఖంగా నిలిచింది ఇరాన్ అథ్లెట్ ఎల్నాజ్ రెకాబీ. అయితే.. ఆపై ఆమె ప్రభుత్వాగ్రహానికి గురికాకతప్పదని, జైలు శిక్ష ఖాయమని అంతా భావించారు. అంతేకాదు.. స్వయంగా ఆమె తన అరెస్ట్ భయాన్ని సైతం వ్యక్తం చేయడం, ఆ వెంటనే కనిపించడం లేదన్న కథనాలతో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
ఇక భయాందోళనల నడుమ బుధవారం వేకువజామున రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్న ఆమెకు ఊహించని సీన్ కనిపించింది. వేల మంది ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఆమెకు ఘనస్వాగతం పలికారు. హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొన్న ఆమె తెగువకు సలాం చేస్తూ నినాదాలు చేశారు. ఆ గ్రాండ్ వెల్‌కమ్‌ను రెకాబీ సైతం అంతే ఆత్మీయంగా స్వీకరించింది.
33 ఏళ్ల వయసున్న రెకాబీ.. ఇరాన్ తరపున సియోల్(దక్షిణ కొరియా రాజధాని)లో ఆదివారం జరిగిన క్లయింబింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నారు. గతంలో హిజాబ్‌తోనే ఆమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఆదివారం ఈవెంట్ సందర్భంగా ఆమె హిజాబ్ ధరించకపోవడంతో ఆమె ఇరాన్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాక తప్పదని అంతా భావించారు. ఇరాన్‌లో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో భాగంగానే ఆమె అలా చేసి ఉంటుందని అంతా చర్చించుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అరెస్ట్ కాక తప్పదని అనుకున్నారు. కానీ, ఆ అంచనా తప్పింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమెని గతంలో స్పందిస్తూ.. ఇరాన్ మహిళా అథ్లెట్లకు మెడల్స్ కంటే హిజాబ్ ముఖ్యమని సూచించారు. అయితే.. రెకాబీ మాత్రం హిజాబ్ తొలగించి మరీ పోటీల్లో పాల్గొంది. ఇక హిజాబ్ తొలగింపుపై ఇరాన్ నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్తూ.. అది అనుకోకుండా జరిగిందంటూ ఓ సందేశం సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టెహ్రాన్‌లో ల్యాండ్ అయిన ఆమెకు.. ముందు ముందు ఎలా ఉంటుందన్నది చూడాలి మరి!.
ఇదీ చదవండి: తప్పు జరిగిపోయింది.. క్షమించండి
Comments
Please login to add a commentAdd a comment