How Nestle Found Their Way In Japan - Sakshi
Sakshi News home page

Nestlé: మంచి కాఫీలాంటి స్టోరీ.. కాఫీ తాగని దేశం..కాఫీ లవర్‌గా మారిందెలా?

Published Sat, Apr 23 2022 8:55 AM | Last Updated on Sat, Apr 23 2022 1:10 PM

How Nestle Found Their Way In Japan - Sakshi

ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కొందరు టీ రుచిని ఆస్వాదిస్తే ఇంకొందరు కాఫీ ఘుమఘుమలను ఇష్టపడతారు. అయితే వేల సంవత్సరాలుగా టీని అభిమానించి.. దాన్నే తాగడానికి అలవాటుపడిన ఓ దేశాన్ని ఒక కంపెనీ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే కాఫీ లవర్స్‌లా మార్చేసింది. అదెలా సాధ్యమైంది..  ఆ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందామా మరి.

టీని ప్రేమించే దేశం... 
ప్రముఖ బహుళజాతి కంపెనీ నెస్లే గురించి తెలుసుగా... స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ సంస్థ ఆహార, పానియాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రత్యేకించి ఇన్‌స్టంట్‌ కాఫీ ఉత్పత్తుల తయారీలో దిగ్గజం. కానీ ఈ సంస్థ 1970లలో జపాన్‌లో తమ ఇన్‌స్టంట్‌ కాఫీని విక్రయించేందుకు పడరాని పాట్లు పడింది. ఒక్క కప్పు కాఫీ కూడా అమ్మలేక చతికిలపడింది. ఇందుకు కారణం.. జపాన్‌ వేల సంవత్సరాలుగా టీని ఇష్టపడే దేశం కావడమే. ఇలాంటి మార్కెట్‌లో నెస్లే అడుగు ఎలా పెట్టింది? 

అక్కడి సంస్కృతిని అర్థం చేసుకొని.. 
ఇందుకోసం నెస్లే గట్టి కసరత్తే చేసింది. సంస్కృతిలో భాగంగా కొన్ని వస్తువులతో ప్రజలు ఏర్పరుచుకొనే ప్రత్యేక అనుబంధంపై పరిశోధనలు చేయడంలో పేరుగాంచిన సైకోఅనలిస్ట్, ఫ్రాన్స్‌ జాతీయుడైన క్లోయ్‌టెర్‌ రాపిల్లేను తన మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. జపాన్‌పై అధ్యయనం చేపట్టిన క్లోయ్‌టెర్‌... నెస్లే కాఫీ రుచులను ముందుగా జపాన్‌ పిల్లలకు అలవాటు చేయడానికి ఓ వ్యూహం సూచించాడు. క్లోయ్‌టెర్‌ చెప్పిందే తడవుగా మొదటి దశలో భాగంగా నెస్లే జపాన్‌ మార్కెట్‌ను కాఫీ రుచితో కూడిన స్వీట్లు, చాక్లెట్లతో ముంచెత్తింది. పిల్లలకు ఇవి తెగ నచ్చాయి. నెమ్మదిగా జపాన్‌కు కాఫీ రుచి తెలిసొచ్చింది.  
చదవండి👉అతనికి 50, ఆమెకు 23.. ఏజ్‌ గ్యాప్‌ ఉన్నా పర్లేదంటూ మాట కలిపిన ఇంజనీరింగ్‌ యువతి

నేటి పిల్లలే రేపటి వినియోగదారులు 
కాఫీ రుచి కలిగిన క్యాండీలు ప్రవేశపెట్టిన పదేళ్ల తర్వాత నెస్లే కొత్త రకం కాఫీ ఉత్పత్తులతో తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టింది. అప్పటికి నెస్లే ‘క్యాండీ వినియోగదారుల్లో’ చాలా మంది పెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు.. దీంతో వారంతా ఈ కాఫీ ఉత్పత్తులను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెస్లే తెచ్చిన ఇన్‌స్టంట్‌ కాఫీ అనతికాలంలోనే మార్కెట్‌ను హస్తగతం చేసుకుంది. తర్వాత 2012లో నెస్లే సంస్థ వివిధ ఆఫీసులకు నెస్‌కెఫే తయారీ మెషీన్లను సరఫరా చేయడంతోపాటు తమ సహచరులకు కాఫీ తయారు చేసి ఇవ్వగల ‘నెస్‌కెఫే అంబాసిడర్‌’లను నియమించింది.

పని ప్రదేశాల్లో రుచికరమైన కాఫీ లభించేందుకు ఈ ప్రచారం దోహదపడింది. అలాగే ప్రజలు సామాజికంగా దగ్గరై సరదాగా గడిపేలా చేసింది. కాఫీ మెషీన్లు విక్రయించేందుకు, కాఫీ కాచి వినియోగదారులకు అందించేందుకు నెస్లే 2014లో హ్యూమనాయిడ్‌ రోబో ‘పెప్పర్‌’ను రంగంలోకి దించింది. జపాన్‌ రాజధాని టోక్యోలో నెస్లే 2019లో ప్రత్యేకంగా ఒక స్లీప్‌ కేఫ్‌ను తెరిచింది. ఈ కేఫ్‌కు వచ్చే వారు మెత్తటి పరుపులపై చిన్నపాటి కునుకుతీసి కాఫీ తాగేలా ఏర్పాట్లు చేసింది. 

టీ టు కాఫీ
ఫైనల్‌గా ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు కనీసం కాఫీని తాగడానికి ఇష్టపడని జపాన్‌.. 2020 నాటికి ప్రపంచంలోకెల్లా 7వ అతిపెద్ద కాఫీ దిగుమతిదారుగా తయారైంది. ఈ దేశం ఏటా జపాన్‌ 43 లక్షల టన్నుల కాఫీని వినియోగిస్తోంది. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement