
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ దుయ్యబట్టింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కాజల్ భట్ మాట్లాడారు. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు.
కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు భారత్ సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల్లో అత్యధికులు పాక్‌లోనే తలదాచుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment