ఖతార్‌లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు! | India Welcomes Release of Eight Indian Nationals | Sakshi
Sakshi News home page

India-Qatar: ఖతార్‌లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!

Published Mon, Feb 12 2024 7:00 AM | Last Updated on Mon, Feb 12 2024 12:36 PM

India Welcomes Release of Eight Indian Nationals - Sakshi

భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్‌లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్‌లకు ఖతార్‌లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్‌కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. 

దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన కాప్‌-28 కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్‌తో మాట్లాడారు. 

ఖతార్‌ అదుపులో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్‌ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement