వాషింగ్టన్: అమెరికా ప్రపంచ దేశాలకు ఉచితంగా పంపిణీ చేయనున్న కోవిడ్ టీకా డోస్‌లలో భారత్‌కే అధిక పరిమాణంలో టీకాలు దక్కుతాయని అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను విరివిగా పంపిణీ చేయాలని అమెరికా నిర్ణయించిందనే విషయాన్ని సంధూ గుర్తు చేశారు. ఈ విషయంలో అగ్రరాజ్యం తాజాగా విడుదల చేసిన పొరుగు, మిత్రదేశాల జాబితాలో భారత్ ఉందన్నారు. జాబితాలోని దేశాలకు అమెరికా కరోనా టీకాలను నేరుగా పంపిణీ చేయనుందని పేర్కొన్నారు. అవసరానికి మించి ఉన్న టీకాలను ఇండియాలాంటి దేశాలకు అందజేయాలంటూ జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన వెల్లడించారు.
భారత్ ఇప్పటికే టీకాల కొరతను ఎదుర్కొంటోందని చెప్పారు. దీంతో మిగులు టీకా డోస్‌లను ప్రపంచ దేశాలకు అందజేయాలని అమెరికా ఇటీవల నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ గురువారం భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు. వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్న దేశాలకు త్వరలో 2.5 కోట్ల డోసులను అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే ప్రకటించారు. వీటిలో 1.9 కోట్ల డోసులను ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఇస్తామన్నారు. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రపంచ దేశాలకు 8 కోట్ల డోసులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment