ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ అయిన సుమారు 200 కోట్ల కోవిడ్ టీకా డోసుల్లో భారత్, అమెరికా, చైనాల వాటాయే 60% వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కోవిడ్ డోసుల పంపిణీలో 200 కోట్ల మైలురాయిని ఈ వారంలో అధిగమిస్తామని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ అడ్వైజర్ బ్రూస్ అయిల్‌వార్డ్ తెలిపారు. ప్రస్తుతం 212 దేశాల్లో టీకా పంపిణీ అవుతోందని ఆయన పేర్కొన్నారు. 200 కోట్ల డోసుల్లో 10 దేశాల వాటా 75% వరకు ఉందనీ, మొత్తం డోసుల్లో భారత్, అమెరికా, చైనాలు కలిపి 60% వరకు పంపిణీ చేశాయని ఆయన వెల్లడించారు. ఈ మూడు దేశాలు దేశీయంగానే టీకాలు సేకరించి, పంపిణీ చేశాయన్నారు.
అన్ని దేశాలకు టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన కోవాక్స్ కార్యక్రమం కింద 127 దేశాలకు ఇప్పటి వరకు 8 కోట్ల టీకా డోసులు అందజేశామన్నారు. టీకాల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చాలా దేశాలు ‘కోవాక్స్’సాయంతోనే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయని ఆయన చెప్పారు. అయితే, ప్రపంచ జనాభాలో 10% వరకు కలిగిన పేద దేశాలకు మొత్తం డోసుల్లో కేవలం 0.5% మాత్రమే అందడం విచారకరమని ఆయన అన్నారు. ప్రధానంగా, భారత్‌లో సెకండ్ వేవ్ కారణంగా కోవాక్స్ కింద సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సరఫరా చేయాల్సిన టీకా డోసులు ఆగిపోయాయని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ఈ సమస్య పరిష్కారమై, కోవాక్స్ కింద పేద దేశాలకు ఇచ్చిన హామీ మేరకు 15 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రపంచ జనాభాలో కనీసం 30–40 శాతం మందికి టీకా అందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. భారత్‌లో మొత్తమ్మీద మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment