సింగపూర్: మాదకద్రవ్యాలను తమ దేశంలోకి తెస్తున్నాడనే ఆరోపణలపై భారతీయ మూలాలున్న మలేసియన్ నాగేంద్రన్ కె.ధర్మలింగంకు ఉరిశిక్ష ఖరారుచేయడాన్ని సింగపూర్ ప్రభుత్వం మరోసారి సమర్థించుకుంది.హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న సమయంలో అతని మానసిక స్థితి సరిగానే ఉందని సింగపూర్ హోం శాఖ స్పష్టంచేసింది. నేరం చేస్తున్నాననే విషయం ఆనాడు అతనికి తెలుసని, అప్పుడు అతనికి మానసిక ఆరోగ్యం బాగానే ఉందనే సాక్ష్యాలను హైకోర్టు పరిశీలించిందని హోం శాఖ పేర్కొంది.
వచ్చే బుధవారం అక్కడి చాంగి జైలులో నాగేంద్రన్‌ను ఉరితీయనున్నారు. మానసిక దివ్యాంగుడైన నాగేంద్రన్‌పై నేరాభియోగాలు మోపి అక్రమంగా ఉరితీస్తున్నారని ఆన్‌లైన్ వేదికగా వేలాదిమంది ఉద్యమిస్తున్నారు. శిక్షకు వ్యతిరేకంగా మద్దతు కోరుతూ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది. శనివారం నాటికి ఏకంగా 56,134 సంతకాలను సేకరించారు. పదో తేదీన మీ కుమారుడిని ఉరితీస్తామంటూ అతని తల్లికి జైళ్ల శాఖ కబురుపెట్టడంతో ఉరిశిక్ష అమలు చేయబోతున్న విషయం బయటకు పొక్కింది.
దీంతో ఒక్కసారిగా సింగపూర్‌లో నిరసన పెల్లుబికింది. మానవహక్కుల సంఘాలు సింగపూర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. మలేసియా నుంచి సింగపూర్‌కు 2009 ఏడాదిలో 42.72 గ్రాముల హెరాయిన్‌ను తరలిస్తున్నాడనే ఆరోపణలపై నాగేంద్రన్‌ను అరెస్ట్‌చేసి 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించడం తెల్సిందే. 15 గ్రాములకు మించి హెరాయిన్‌ను సింగపూర్‌లోకి తీసుకొస్తే దానిని నేరంగా అక్కడ తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment